90 ఏళ్ల వయసులో వీల్ చైర్‌పై రాజ్యసభకు మన్మోహన్ సింగ్

90 ఏళ్ల వయసులో వీల్ చైర్‌పై రాజ్యసభకు మన్మోహన్ సింగ్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రజాస్వామ్యంపై తనకున్న నిబద్ధతను చాటుకున్నారు.  2023 ఆగస్టు 07న ఢిల్లీ సర్వీసెస్ బిల్లు రాజ్యసభలో చర్చకు రాగా ఆయన వీల్ చైర్‌ లో వచ్చి ఓటేశారు.  

90 ఏళ్ల వయసులో కూడా అనారోగ్యాన్ని లెక్కచేయకుండా తన బాధ్యతలు నిర్వహించేందుకు వచ్చిన మన్మోహన్ సింగ్ ను చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చాలా మంది పార్లమెంట్ కు డుమ్మా కొడతారని, కానీ మన్మోహన్ సింగ్ ను చూసి నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.  కాగా సెప్టెంబర్  నెలలో 91వ ఏట అడుగుపెట్టనున్నారు  మన్మోహన్ సింగ్.  

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 102 ఓట్లు పడ్డాయి. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. సాంకేతిక సమస్యతో స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ నిర్వహించారు. డివిజన్ కు విపక్షం పట్టుబడడంతో రెండోసారి ఓటింగ్ నిర్వహించారు. 

ఎన్డీఏకు వైసీపీ, బీజేడీ, బీఎస్పీ, టీడీపీ సభ్యులు మద్దతు తెలిపారు. బిల్లుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు ఓట్లు వేశారు. ఇప్పటికే లోక్ సభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రపతి ఆమోదంతో చట్టంకానుంది ఢిల్లీ సర్వీసెస్​ బిల్లు.