మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిర్మాణ ప్లాన్పరిశీలన

మన్మోహన్ సింగ్  ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ  నిర్మాణ ప్లాన్పరిశీలన

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ లో 300 ఎకరాల్లో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నిర్మించనున్నట్లు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్​లోని సచివాలయంలో తన ఛాంబర్ లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగిత రానా, అధికారులతో కలిసి యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్ట్ ఉష రూపొందించిన ప్లాన్ ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఈ యూనివర్సిటీ మొట్టమొదటిదని తెలిపారు.

 నాణ్యత ప్రమాణాలతో అత్యాధునిక  హంగులతో యూనివర్సిటీ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్కిటెక్ట్ ఉష రూపొందించిన ప్లాన్​  గురించి కలెక్టర్ జితేశ్​వీ పాటిల్​తో ఫోన్​లో మాట్లాడారు. సీఎం రేవంత్​ రెడ్డి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన వెంటనే శంకుస్థాపన నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నిర్మాణం అయ్యేంతవరకు ప్రస్తుతం ఉన్న కాలేజీలో స్టూడెంట్స్​కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లాసులు జరిగేలా చూడాలని సూచించారు.