అమరవీరుల గౌరవార్థం మేరీ మిట్టి మేరా దేశ్..మన్ కీ బాత్లో ప్రధాని ప్రకటన

అమరవీరుల గౌరవార్థం  మేరీ మిట్టి మేరా దేశ్..మన్ కీ బాత్లో ప్రధాని ప్రకటన

ప్రతి నెలా చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ 103వ ఎపిసోడ్ లో కీలక ప్రకటన చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరుల స్మారకార్థం  మేరీ మిట్టీ మేరా దేశ్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అమరుల స్మారకార్థం దేశంలోని లక్షలాది గ్రామాల్లో శాసనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా అమృత్ కలశ్ యాత్రను నిర్వహిస్తామన్నారు. ఇందులో దేశం నలు మూలల నుంచి 7500 కలశాల్లో మట్టిని సేకరించి ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ముగింపు పలుకుతామని పేర్కొన్నారు. 

అనంతరం ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా వరదలు, వానల కారణంగా అనేక మంది ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ ఎఫ్ బృందాల సేవలను కొనియాడారు. యమునా సహా పలు నదుల్లో వరద పోటెత్తడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి భీభత్సం సృష్టించాయి. ఇటీవల బీపార్జాయ్ తుఫాన్ గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనమంతా సమిష్టిగా కృషి శక్తిని మరోసారి ప్రదర్శించామని ప్రధాని మోదీ అన్నారు. 

మన్ బాత్ లో భాగంగా ప్రధాని మోదీ పలు అంతర్జాతీయ విషయాలను ప్రస్తావించారు. అమెరికా వందకు పైగా పురాతన కళాఖండాలను భారత దేశానికి తిరిగి ఇచ్చిందని అన్నారు. ఇవి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 2500 నుంచి 250  సంవత్సరాల నాటివి అని అన్నారు. టెర్రకోట, రాయి, లోహం, కలప ఉపయోగించి వీటిని తయారు చేశారు. వీటిలో కొన్ని మీలో ఆశ్చర్యాన్ని నింపే విధంగా ఉంటాయి. వాటిని ఒక్కసారి చూస్తే మైమరచిపోతారు. వీటిలో మీరు 11వ శతాబ్దానికి చెందిన అందమైన ఇసుకరాతి శిల్పాన్ని కూడా చూడవచ్చు. ఇది మధ్యప్రదేశ్‌కు చెందిన 'అప్సర' డ్యాన్స్‌కి సంబంధించిన ఆర్ట్‌వర్క్" అని మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని చెప్పారు.