భూదందాపై మాట్లాడితే ఫోన్ సీజ్ చేస్తారా : మన్నె క్రిశాంక్

భూదందాపై మాట్లాడితే ఫోన్ సీజ్ చేస్తారా : మన్నె క్రిశాంక్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీలో రూ.3 వేల కోట్ల భూదందా జరిగిందని మాట్లాడినందుకు పోలీసులు తన ఫోన్ సీజ్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ దందాకు సంబంధించి ఆరోపణలు చేసింది తాను కాదని, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేశారన్నారు. భూదందాపై తాను సోషల్ మీడియాలో పోస్టు పెడితే.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్ గౌడ్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారని వెల్లడించారు.

ఆ తర్వాత పోలీసులు నోటీసులిచ్చి తన ఫోన్‌ను, పాస్ పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. చిత్రపురి సొసైటీ కోశాధికారి అనుముల మహానంద రెడ్డి ఎవరో తెలియదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, కానీ సీఎంతో మహానంద రెడ్డి దిగిన ఫొటోలు చాలా ఉన్నాయన్నారు. గతంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారని, అప్పుడు ఆయన ఫోన్‌ను ఏమైనా సీజ్ చేశామా? క్రిశాంక్‌ ప్రశ్నించారు.