బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ మస్ట్ : మన్సుఖ్ మాండవీయ

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ మస్ట్ :  మన్సుఖ్ మాండవీయ

రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులపై సమీక్షించేందుకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరోనా కొత్తవేరియంట్ ను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కొత్త కేసులను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. సీనియర్ సిటిజన్స్ కు బూస్టర్ డోసులు వేయించేలా చర్యలు తీసుకోవాలని మాండవియా సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేయాలని రెగ్యులర్ హ్యాండ్ వాష్పై ప్రజలకు మళ్లీ అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని, ఆస్పత్రుల్లో అన్ని వసతులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. 

కొవిడ్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే సూచించింది. కొవిడ్ సర్వైలెన్స్ వ్యవస్థను పటిష్టపర్చే దిశగా నిర్ణయాలు తీసుకుంది. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గైడ్ లైన్స్ జారీ చేసింది. రద్దీగా ఉన్న ప్రదేశాలతో పాటు ఇండోర్, ఔట్ డోర్స్ లల్లో మాస్కులను ధరించాలని సూచించింది. షాపింగ్ మాల్స్, ఏసీ గదులు, హోటల్స్, మల్టీప్లెక్సుల్లో మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేసింది.