భూదాన్ భూములు కాజేశారు.. రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం

 భూదాన్ భూములు కాజేశారు.. రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం
  • దర్జాగా కబ్జాలు, అక్రమంగా ఫెన్షింగ్​లు
  • రికార్డుల్లోనూ తారుమారు చేస్తున్న దళారులు
  • కలెక్టరేట్ సమీపంలోనే సాగుతున్న తతంగం
  • పట్టించుకోని రెవెన్యూ అధికారులు

మహబూబాబాద్, వెలుగు: భూదాన్​ భూముల్లో అక్రమాలకు తెరలేచింది. మానుకోట జిల్లా కేంద్రంలో రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కొందరు అక్రమార్కులు ఆయా భూములు కబ్జాచేసి అమ్ముకుంటున్నా, రెవెన్యూ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

గ్రామదాస్ చట్టం 1965లోని సెక్షన్ 9(1) ప్రకారం భూదాన్ భూముల్లో క్రయవిక్రయ లావాదేవీలు చేయొద్దనే నిబంధనలు ఉన్నా, యథేచ్ఛగా భూ క్రయవిక్రయాలు, రెవెన్యూ రికార్డుల మార్చిడి, రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఇదే భూముల్లో జోరుగా అక్రమ మట్టి రవాణా దందా కొనసాగుతోంది. రాత్రికి రాత్రే మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆక్రమణలు, మట్టి తరలింపులపై చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి..

కలెక్టరేట్​ సమీపంలోనే ఆక్రమణలు..

మహబూబాబాద్​ కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో బేతోల్ రెవెన్యూ పరిధిలోని కొడిసెల బోడ్ లో భూదాన్ బోర్డుకు చెందిన 41.27 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ భూములను విక్రయించవద్దు. కానీ, కొందరు అక్రమార్కులు సమీపంలోని పట్టా భూముల నెంబర్లు చూపుతూ అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారు. 

రెవెన్యూ రికార్డుల ప్రకారం భూదాన్ బోర్డుకు సంబంధించి సర్వే నంబరు 56లో 20.34 ఎకరాలు, 280 సర్వే నంబరులో 20.33 ఎకరాలు మొత్తం 41.27 ఎకరాలు ఉంది. కానీ, పక్కనే ఉన్న పట్టా భూముల సర్వే నెంబర్లను చూపుతూ ఆక్రమణలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రం సమీపంలో భూధాన్ భూములు మాధాపురంలో 309 ఎకరాలు, శనిగపురం 53 ఎకరాలు, మల్యాల 20 ఎకరాలు మొత్తంగా సుమారుగా 430 ఎకరాల భూమి ఉంది. 

కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం..

మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని బేతోల్ రెవెన్యూ పరిధిలో రూ.కోట్ల విలువైన భూములు కబ్జా కొనసాగుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో భూదాన్ భూములు చేతులు మారుతున్నాయి. తమ పట్టా భూములంటూ సమీపంలోని కొందరు దళారులు ఫెన్షింగ్​ విస్తరిస్తూ ఆక్రమించుకున్నారు. 


ఇక్కడ ఎకరం ధర రూ.1.10 కోట్లు పైగాపలుకుతుండడంతో అక్రమాలకు తెరలేచింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలో దిగి కొందరు నిరుపేదలకు సాగుచేసుకునేందుకు భూదాన్ బోర్డు పంపిణీ చేసిన భూములపై కన్నేశారు. దీంతో రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతోంది. 

ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు..

జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూదాన్ భూములను ఇతరులు అక్రమంగా ఆక్రమించుకోవడం, అనుమతి లేకుండా భూదాన్​భూముల నుంచి మట్టిని తరలించడం, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి భూముల అమ్మకాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. జిల్లాలో భూదాన్ భూముల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు కోసం చర్యలు చేపడుతాం.

- అనిల్​ కుమార్, అడిషనల్ కలెక్టర్, మహబూబాబాద్-

జోరుగా మట్టి దందా...

బేతోలు భూదాన్ భూముల నుంచి జోరుగా అక్రమ మట్టి దందా కొనసాగుతుంది. మహబూబాబాద్ పట్టణంలో కొత్తగా ఇండ్లు నిర్మించుకునే వారు, లెవలింగ్ కోసం మట్టిని వినియోగిస్తున్నారు. మట్టి ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.1000 చెల్లించి కొనుగోలు చేస్తుండగా, అక్రమార్కులు రాత్రి వేళల్లో జేసీబీలతో ట్రాక్టర్ల ద్వారా అక్రమ మట్టి రవాణా చేస్తున్నారు. అక్రమ మట్టి దందా పై రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.