ఇమ్యూనిటీ పెంచే ఫుడ్డుపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్న జనం

ఇమ్యూనిటీ పెంచే ఫుడ్డుపైనే  ఇంట్రెస్ట్ చూపిస్తున్న జనం

సికింద్రాబాద్​, వెలుగు: కరోనా భయంతో చాలా మంది తిండి అలవాట్లను మార్చేసుకున్నారు. ఇమ్యూనిటీని పెంచే ఫుడ్డుపైనే ఎక్కువ ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. చాలా మంది ఎక్స్​పర్ట్స్​ సలహాలు తీసుకోకుండానే సొంత నిర్ణయాలతో వాటిని వాడేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్​లోని తార్నాకలో ఉన్న నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ న్యూట్రిషన్(ఎన్​ఐఎన్) ఆన్​లైన్​ సర్వే చేసింది. గూగుల్​ సెర్చ్​లో సేకరించిన అంశాల ఆధారంగా ఫుడ్​ సేఫ్టీ, వారు వాడుతున్న ఇమ్యూనిటీ బూస్టర్లు సహా 28 అంశాలపై 957 మంది నుంచి వివరాలను తీసుకుంది. వారిలో అత్యధికంగా 71 శాతం మంది విటమిన్​ సీ సప్లిమెంట్లు తీసుకున్నట్టు తేలింది. మరో 68.2 శాతం మంది విటమిన్​ సీ ఉన్న పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలను తిన్నట్టు చెప్పారు. జింక్​ సప్లిమెంట్లను వాడినట్టు 61.4 శాతం మంది చెప్పారు. మన వంటల్లో వాడే అల్లం, అల్లంతో తయారు చేసే రసాలను వాడినట్టు 62.9 శాతం మంది, వెల్లుల్లితో తయారు చేసిన ఫుడ్​ను తీసుకున్నట్టు 50.9 శాతం మంది చెప్పుకొచ్చారు. 

మోడీ చెప్పారని..

హెర్బల్​ ప్లాంట్స్, మిరియాల కషాయం గురించి చాలామంది గూగుల్ ​సెర్చ్ ద్వారా తెలుసుకున్నప్పటికీ.. కొంచెం ఘాటుగా ఉండడం వల్ల మిరియాల కషాయాన్ని తీసుకోలేకపోయినట్టు సర్వేలో పాల్గొన్నవాళ్లు చెప్పారు. 28.8 శాతం మందే మిరియాల కషాయాన్ని వాడినట్టు సర్వేలో తేలింది. ప్రధాని నరేంద్ర మోడీ సూచించారని చవన్​ప్రాశ్ వాడి నట్టు 57.5% మంది చెప్పడం విశేషం. హోమియో మందులను ఇమ్యూనిటీ బూస్టర్లుగా వాడినోళ్లు 28.1 శాతమని సర్వే పేర్కొంది. ఆన్​లైన్​ ఫుడ్​ తినడాన్ని తగ్గించి ఇంటివంటకు ప్రాధాన్యం ఇచ్చామని 60% మంది చెప్పారు.