బీహార్లో ఆరుగురిని పొట్టన పెట్టుకున్న కల్తీ మద్యం

బీహార్లో ఆరుగురిని పొట్టన పెట్టుకున్న కల్తీ మద్యం

బీహార్లో విషాదం చోటు చేసుకుంది.  సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న బీహార్‌లో కల్తీ మద్యం తాగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.  మోతిహారిలో ఏప్రిల్ 15వ తేదీన  కల్తీ మద్యం తాగి 6 మంది చనిపోయారు. ఈ ఘటనలో మరో 12 మంది ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గతేడాది డిసెంబర్‌లో ఛప్రాలో నకిలీ మద్యం సేవించి 80 మంది చనిపోయారుని... బ్లాక్ మార్కెట్‌లో మద్యం విక్రయిస్తున్నారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

కల్తీ మద్యం సేవించి మోతీహారిలో పలువురు మృతి చెందడంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. కల్తీ మద్యం తాగి  ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని..బాధితులను ఆదుకుంటామన్నారు. 

ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సారథ్యంలోని ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో బీహార్లో  మద్యం అమ్మకాలు, వినియోగంపై సంపూర్ణ నిషేధాన్ని విధించింది. అయినా...అక్కడ బ్లాక్‌ మార్కెట్‌లో మద్యం ఏరులై పారుతోంది. ప్రజలు  కల్తీ మద్యం తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.

అంతకుముందు జనవరిలో సివాన్‌లో నకిలీ మద్యం సేవించి నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన తర్వాత బీహార్ పోలీసులు రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపారు. అక్రమంగా మద్యం  వ్యాపారం చేయడంతో పాటు..మద్యాన్ని  నిల్వ చేయడం, కొనుగోలు చేయడం వంటి వాటికి సంబంధించి 16 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత 2023  ఫిబ్రవరిలో బీహార్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న 15 మందిని ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఎనిమిది మంది మద్యం వ్యాపారులు కూాడ ఉన్నారు. ఈ అక్రమార్కుల నుంచి స్వదేశీ, విదేశీ బ్రాండ్ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.