మావోయిస్టు దంపతులు సరెండర్..రాచకొండ సీపీ ఎదుట లొంగిపోయిన సంజీవ్, పార్వతి

మావోయిస్టు దంపతులు సరెండర్..రాచకొండ సీపీ ఎదుట లొంగిపోయిన సంజీవ్, పార్వతి
  • దశాబ్దాలుగా దండకారణ్యంలో పార్టీకి సేవలు
  • గద్దర్​కు ప్రధాన అనుచరుడిగా ఉన్న సంజీవ్

ఎల్బీనగర్, వెలుగు:మావోయిస్టు నేత సంజీవ్ అలియాస్ లింగు దాదా, అతని భార్య బొంతం పార్వతి అలియాస్ దీనా గురువారం రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ పదేండ్ల పాటు దండకారణ్యంలో పని చేశారు. జన నాట్య మండలిని సంజీవ్ స్థాపించారు. ఇద్దరి సరెండర్​కు సంబంధించిన వివరాలను సీపీ సుధీర్ బాబు ఎల్బీనగర్ క్యాంప్ ఆఫీస్​లో మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ లోని యాప్రాల్ ప్రాంతానికి చెందిన మాల సంజీవ్.. 1980లో గద్దర్ నేతృత్వంలోని సీపీఐ పీపుల్స్ వార్​లో కీలక సభ్యుడుగా ఉన్నారు. 

జన నాట్య మండలిలో అప్పటి సభ్యులైన డప్పు రమేశ్, దయ, విద్యా, దివాకర్ తో కలిసి సుమారు 16 రాష్ట్రాల్లో పీపీల్స్ వార్ గురించి ప్రచారం చేశారు. ఆ తర్వాత గద్దర్ ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్నారు. 1982లో కరీంనగర్ హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన పంజాల సరోజ అలియాస్ విద్యను పెండ్లి చేసుకున్నారు. 2002లో ములుగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో సంజీవ్ తప్పించుకోగా, విద్య చనిపోయింది. 

1996లో సీపీఐ పీపుల్స్ వార్ గ్రూప్ లో మణుగూరు దళంలో చేరి డివిజన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. తర్వాత ఏటూరు నాగారం, పాండవ, మహా దేవపూర్ దళాల్లో వర్క్​ చేశారు. 2001లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ పరిధిలో పనిచేశారు. 2003లో దండ కారుణ్య స్పెషల్ జోనల్ కమిటీలోని చైతన్య నాట్య మంచ్ ఇన్​చార్జ్ గా బాధ్యతలు చేపట్టారు. 

ఒక్కొక్కరిపై రూ.20 లక్షల రివార్డ్

ఉమ్మడి మహబూబ్ నగర్ పదర మండలానికి చెందిన బొంతం పార్వతి అలియాస్ దీన కూడా 1992లో నల్లమల ప్రాంతంలో మూవోయిస్ట్ దళంలో చేరారని సీపీ సుధీర్ బాబు తెలిపారు. పీపుల్స్ గ్రూప్ లో అప్పర్ ప్లాట్యూ, దళం, పానగల్ దళం, జననాట్య మండలిలో చేరి 1998లో ఏరియా కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో విశాఖపట్నం జిల్లా పరిధిలో ఏవోబీ ఎస్ జెడ్ సీలో గాలికొండ ఏరియా దళంలో ఏసీఎంగా, 2007లో దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో.. తర్వాత చైతన్య నాట్య మంచ్ లో చేరారు.

 అదే టైమ్​లో మాల సంజీవ్, దీన పెండ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి సీఎన్ఎంలో పనిచేస్తూ సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. 2018లో దీన ఎస్​సీఎంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. ఇద్దరు కలిసి దండ కారణ్య ప్రాంతంలో గిరిజనులను మూవోయిస్ట్ పార్టీ వైపు ఆకర్షించేలా పాటలు పాడుతూ బాధ్యతలు నిర్వహించారు. వీరికి తెలుగు, హిందీ, కోయ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉండడంతో సీఎన్ఎం కేడర్లకు శిక్షణ ఇచ్చారు. 

కాగా, సంజీవ్ 2002లో ములుగు జిల్లాల్లో అయిలాపూర్ అడవుల్లో జరిగిన ఈవోఎఫ్ లో, 2005లో చత్తీస్​గఢ్ బీజాపూర్ నేషనల్ పార్క్ ఏరియాలో ఈవోఎఫ్ నుంచి తప్పించుకున్నారు. దీన సైతం 2017లో మాడ్ డివిజన్ లో జరిగిన ఈవోఎఫ్ సంఘటన నుంచి తప్పించుకున్నారు. అయితే, ఇద్దరిపై తలా రూ.20 లక్షల రివార్డ్ ఉన్నట్లు సీపీ వెల్లడించారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జన జీవన స్రవంతిలో రావాలని కోరారు. పోరుకోసం కాకుండా ఊరు, కుటుంబ సభ్యుల కోసం వస్తే  తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచేందుకు కృషి చేస్తుందని వివరించారు.