మావోయిస్ట్ ఫ్రీ ఇండియాను స్థాపిస్తాం.. 2026 మార్చి నెలాఖరు వరకు భారత్ లో మావోయిస్టులను ఏరిపారేస్తాం.. లొంగిపోండి లేదంటే ప్రాణాలపై ఆశలు వదులు కోండి.. ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే మావోయిస్టులకు విధించిన డెడ్ లైన్. అన్నట్లుగానే ఆపరేషన్ కగార్ నిర్వహించి మావోయిస్టు శిభిరాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది కేంద్రం. ఈ పరిస్థితుల్లో బతికుంటే చాలు అన్నట్లుగా చాలా మంది అగ్రనేతలతో సహా మావోయిస్టులు కొందరు లొంగిపోయారు. కానీ కేంద్ర బలగాలకు సవాల్ గా నిలిచిన హిడ్మా లొంగిపోలేదు. పరిస్థితులను చూసి తల్లడిల్లిన హిడ్మా తల్లి.. ఎక్కుడున్నా ఇంటికి రా బిడ్డా.. నువ్వు రాకుంటే నేనే వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తా.. అంటూ వేడుకోలు సందేశం పంపింది. దీని తర్వాత సరిగ్గా వారం రోజులకే హిడ్మా ఎన్ కౌంటర్ లో చనిపోయాడు.
2025 నవంబర్ 18వ తేదీన ఉదయం ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లీ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా చనిపోయాడు. అతని భార్య హేమ కూడా ఈ ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఎన్ కౌంటర్ లో హిడ్మాతో పాటు మొత్తం ఆరు మంది మావోయిస్టులు మృతి చెందారు.
వారం క్రితం హిడ్మా ఇంటికి ఛత్తీస్ గఢ్ హోంమంత్రి:
హిడ్మాను లొంగిపోవాల్సిందిగా కోరిన ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం.. వారం రోజుల క్రితమే అంటే.. నవంబర్ 11 న హిడ్మా ఇంటికి రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి విజయ్ శర్మ సందర్శించారు. హిడ్మా తల్లి యోగక్షేమాలు అడిగి.. ఆమెతో కలిసి భోజనం చేశారు. హిడ్మా లొంగిపోయేలా నచ్చజెప్పాలని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. మావోయిస్ట్ రహిత భారత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కృషి చేస్తున్నట్లు చెప్పారు.
దీంతో హిడ్మా నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేయ్ బిడ్డా అని ఆ తల్లి భావోద్వేగంతో వేడుకుంది. ఏ తల్లి అయినా తన కుమారుడు క్షేమం కోరుకుంటుంది. అదే విధంగా తన కొడుకును ఎక్కడ ఎన్ కౌంటర్ చేస్తారోనని.. ఇంటికి వచ్చేయ్ బిడ్డా అంటూ వేడుకుంది. నీవు ఎక్కడున్నా వెతికేందుకు అడవుల్లోకి వస్తాను.. చివరి రోజుల్లో ఈ అమ్మకు తోడుండు కొడుకా.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కొడుకు వస్తే కళ్లారా చూసుకోవాలని ఆశపడింది. కానీ ఆమె ఆశ తీరలేదు.. కన్నపేగును తడిమాలనుకున్న ఆమె కోరిక నెరవేరలేదు.. వారం తిరిగే లోపే ఆమె కొడుకు హిడ్మా ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు.
మోస్ట్ వాంటెడ్ గా హిడ్మా దళం
మడవి హిడ్మా దళం కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్ దళం. హిడ్మా పై కోటి రూపాయల రివార్డు ఉంది. అంతే కాకుండా అతని భార్య హేమపై కూడా 50 లక్షల రూపాయల రివార్డు ఉంది. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా.. మూడు రాష్ట్రాలకు మోస్ట్‌వాంటెడ్‌గా మారారు. ఎన్నోసార్లు చాకచక్యంగా భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నారు.
మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి హిడ్మా. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కంపెనీ వన్ కమాండర్‌గా ఉన్నారు. హిడ్మా ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. ఇప్పుడున్న మావోయిస్టులలో.. అత్యధిక మంది ఈ గ్రామ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినవారేనని అంచనా.
మావోయిస్టు గా హిడ్మాకు కిషన్‌జీ సారథ్యంలో తొలి అడుగు పడింది. 25 ఏళ్ల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిన హిడ్మా.. అంచలంచెలుగా.. వివిధ దళాలకు నాయకుడిగారు. గతంలో భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా నాయకత్వం వహించారు. చిన్నవయసులోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నియ్యారు. హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలు మాట్లాడగల హిడ్మా.. తన దళాన్ని శక్తివంతమైన టీంగా మార్చుకున్నారు. 2023లో దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన చనిపోయినట్లు ప్రచారం జరిగినా.. మావోయిస్టుల మూడంచెల భద్రతా వ్యవస్థ నడుమ దళాలను కొనసాగిస్తూ వస్తున్నారు.
