లొంగుబాటలో బండి ప్రకాశ్!..

లొంగుబాటలో బండి ప్రకాశ్!..
  • దండకారణ్యం నుంచి హైదరాబాద్​కు
  • పోలీసు బాసులతో చర్చలు..నేడో రేపో క్లారిటీ

కోల్​బెల్ట్, వెలుగు: మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపెల్లి వాసుదేవరావు బాటలో మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతానికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య బాధ్యుడు బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ అలియాస్ అశోక్ అలియాస్ క్రాంతి కూడా లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

 నాలుగైదు రోజుల కిందే ఆయన దండకారణ్యం నుంచి హైదరాబాద్​కు చేరుకొని.. రాష్ట్ర పోలీసు బాసులతో చర్చిస్తున్నట్లు సమాచారం. అనారోగ్యంతో ఉన్న ఆయనకు గురువారం వైద్య పరీక్షలు కూడా నిర్వహించారని అంటున్నారు.

కార్మికనేత హత్యతో అజ్ఞాతంలోకి

మందమర్రిలోని పోచమ్మ ఆలయం ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడు బండి రామారావు,-అమృతమ్మ దంపతుల రెండో కొడుకైన ప్రకాశ్ 1982– -84 మధ్య రాడికల్ స్టూడెంట్ యూనియన్​(ఆర్ఎస్​యూ) ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నాడు. సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) ఆవిర్భావం తరువాత అందులో మిలిటెంటుగా పనిచేశారు. 

1984 నవంబర్​లో మందమర్రికి చెందిన ఏఐటీయూసీ లీడర్ వీటీ అబ్రహం హత్య కేసులో అరెస్టై జైలు జీవితం గడిపారు. వరంగల్​ జైలు నుంచి ఆదిలాబాద్ సబ్ జైలుకు తరలించగా పీపుల్స్​వార్ నేతలు నల్లా అదిరెడ్డి, హుస్సేన్, ముంజం రత్నయ్యతో కలిసి జైలు నుంచి తప్పించుకున్నారు. కొంతకాలానికి బయటకు వచ్చి హేమను పెండ్లి చేసుకొని సాధారణ జీవితం గడిపారు. 

తిరిగి హైదరాబాద్​లో అరెస్టు అయిన ఆయనకు చర్లపల్లి జైలులో పీపుల్స్ వార్ అగ్రనేత శాకమూరి అప్పారావు తదితరులతో ఏర్పడిన పరిచయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సికాసలో కీలకంగా పని చేసిన ఆయన అనేక కార్మక పోరాటాలకు నాయకత్వం వహించారు. వయస్సు మీదపడటంతో పాటు షుగర్ వ్యాధితో బాధ పడుతున్న ఆయన అనారోగ్య సమస్యలతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలస్తున్నది. 41ఏండ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనపై తెలంగాణ ప్రభుత్వం రూ.25లక్షల రివార్డు ప్రకటించింది.