మావో అగ్రనేత హరిభూషణ్ భార్య లొంగుబాటు

మావో అగ్రనేత హరిభూషణ్ భార్య లొంగుబాటు

హైదరాబాద్: మావో అగ్రనేత హరిభూషన్ భార్య శారదక్క అలియాస్ జజ్జరి సమ్మక్క (45) ఈ రోజు డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆమె పార్టీలో భద్రాద్రి కొత్తగూడెం డివిజనల్ కమిటీ మెంబర్‎గా ఆమె పనిచేస్తున్నారు. శారదక్క లొంగుబాటు గురించి డీజీపీ ప్రెస్‎మీట్ పెట్టి మాట్లాడారు.

‘శారదక్క మైనర్‎గా ఉన్నప్పుడే భద్రాద్రి ఏరియాలోని పాండవ దళం కమాండర్‎గా ఉన్న హరిభూషణ్ పార్టీలోకి ఆహ్వానించారు. శారదక్క మహబూబాబాద్ జిల్లా గంగారం గ్రామానికి చెందినది. శారదక్కను పార్టీ అనుమతితో హరిభూషణ్ 1995లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. శారదక్క 2008లో వరంగల్ ఎస్పీ లొంగిపోయి.. 2011 వరకు జనజీవన స్రవంతిలో కలిశారు. అయితే ఆ తర్వాత హరిభూషణ్ నేను వేరే పెళ్లిచేసుకుంటానని కబురు పంపడంతో మళ్లీ మావోలతో చేరారు. ఆ తర్వాత 2016 వరకు భర్తతో కలిసి దళంలో పనిచేశారు. దాదాపు 25 ఏళ్లపాటు దళంలో పనిచేసిన శారదక్క.. పార్టీలో పని చేస్తున్న వారు లొంగిపోవాలని పోలీసుల ద్వారా విజ్ఞప్తి చేసింది. కాగా.. కొంత కాలంకింద హరిభూషణ్ కరోనాతో మరణించడం మరియు మావోల విధానాలతో ఎటువంటి ఉపయోగంలేదని భావించిన శారదక్క పోలీసుల ముందు లొంగిపోయారు. శారదక్కపై ప్రస్తుతం 25 కేసులు ఉన్నాయి. తెలంగాణ కమిటీలో మొత్తం 115 మంది సభ్యులుంటే.. వారిలో 14 మంది తెలంగాణకి చెందిన వారు కాగా.. మరో 11 మంది ఆంధ్రప్రదేశ్‎కి చెందిన వారున్నారు. మిగతా వారంతా చత్తీస్ ఘర్‎కి చెందిన వారే ఉన్నారు.

కరోనాతో పాటు ఇతర వ్యాధులకు మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడంతో మావోయిస్టు పార్టీ నుండి చాలామంది బయటకు రావాలని చూస్తున్నారు. అదేవిధంగా 
ఆజాద్, రాజిరెడ్డి ఆరోగ్యం బాగాలేక బయటకి రావాలని చూస్తున్నారు. అయితే మావోయిస్టు లీడర్స్ మాత్రం వారికి బయటకు వెళ్లొద్దంటూ ఒత్తిడి చేస్తున్నారు. 
శారదక్కకి ఆర్థికసాయం కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. కరోనా వల్ల మావోయిస్టు పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. కోవిడ్ టైంలో తన భర్తకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో మావోయిస్టు పార్టీపై శారదక్క కోపంగా ఉంది. కరోనా వల్ల మావోయిస్టు పార్టీలో పది మందికి పైగా చనిపోయారు. తెలంగాణ నుంచి మావోయిస్టు పార్టీలో కొత్తగా ఎవరు జాయిన్ అవ్వట్లేదు. తెలంగాణ ప్రజల నుంచి మావోయిస్టులకు ఎలాంటి సహకారం అందడం లేదు. లొంగిపోయిన మావోయిస్టులకు రక్షణ కల్పిస్తాం’ అని డీజీపీ అన్నారు.