మావోయిస్టు నేత రామన్న మృతి

మావోయిస్టు నేత రామన్న మృతి

చత్తీస్​గఢ్ సరిహద్దుల్లో గుండెపోటుతో కన్నుమూత

పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న శ్రీనివాస్ 

స్వగ్రామం సిద్దిపేట జిల్లా బెక్కెల్

అన్న, భార్య, కొడుకూ మావోయిస్టులే

సిద్దిపేట, వెలుగు: మావోయిస్టు టాప్ నాయకుడు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న అలియాస్ రమణ ఆకస్మికంగా కన్నుమూశారు. ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులోని బస్తర్ జిల్లా పరిధిలో దండకారణ్యంలో ఆయన సోమవారం గుండెపోటుతో మృతి చెందినట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన రమణ చనిపోయినట్టు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ఐజీ సుందరరాజన్  ధ్రువీకరించారు. అయితే, రమణ మృతిపై మావోయిస్టులు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఛత్తీస్ గఢ్ పోలీసు అధికార వర్గాలు మాత్రం రమణ మృతి చెందినట్లు వెల్లడిస్తున్నాయి. ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురయ్యారని, అదే సమయంలో గుండెపోటు రావడంతో మరణించినట్లు చెప్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో జరిగిన పలు హింసాత్మక సంఘటనల వెనక రామన్న​ పాత్ర పోషించినట్లు అభియోగాలు ఉన్నాయి.

టాప్ కేడర్‌లో ఒకరు

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో ఆ పార్టీ టాప్  క్యాడర్ నేతల్లో ఒకరిగా రామన్న ఉన్నారు. ఛత్తీస్ గఢ్ లోని దండకారణ్య జోనల్  కమిటీ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. ఛత్తీస్ గఢ్ లో 2017లో 25 మంది సీఆర్పీఎఫ్​జవాన్లపై ల్యాండ్ మైన్ పేల్చి హత్య చేసిన సంఘటనలోనూ రామన్న ప్రమేయం ఉన్నట్లు సమాచారం. రామన్నపై పోలీసులు రూ.40 లక్షల రివార్డును ప్రకటించారు. దండకారణ్య జోనల్  కమిటీ ఆధ్వర్యంలో మావోయిస్టు పార్టీ మహాసభలను విజయవంతంగా నిర్వహించడంలో రామన్న చురుకైన పాత్ర పోషించారు. ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ లోని బస్తర్, సుక్మా, దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్, మల్కన్  జిల్లాల్లో మావోయిస్టు పార్టీని పటిష్టం చేసేందుకు ఆయన
పనిచేశారు.

తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే దిశగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రామన్న మృతిచెందడం మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

7వ తరగతిలోనే అడవి బాట..

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బెక్కెల్ గ్రామానికి చెందిన రామన్న నాలుగు దశాబ్దాల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1976లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దుల్మిట్ట  ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగానే ఆర్ఎస్ యూ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన అప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయారు. నలబై ఏళ్లుగా ఆయన కుటుంబసభ్యులతో సంబంధాలను కూడా వదిలేసుకున్నారు. పార్టీలో తనతో పాటు పనిచేస్తున్న మావోయిస్టు సావిత్రిని ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నట్టు తెలుస్తోంది. సావిత్రి ప్రస్తుతం కిష్టాపురం ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరి కొడుకు శ్రీకాంత్ అలియాస్ రంజిత్ కూడా మావోయిస్టుగానే కొనసాగుతున్నట్టు సమాచారం.  రామన్నకు ముగ్గురు అన్నలు, ముగ్గురు అక్కలున్నారు. శ్రీనివాస్ మూడో అన్న పరశురాములు కూడా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ 2003లో నర్సంపేటలో జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందాడు.

ఆయుధాల తయారీలో ఎక్స్​పర్ట్

ఆయుధాలను తయారు చేయడం, మూడో కంటికి తెలియకుండా వాటిని రవాణా చేయడంలో రమణ ఎక్స్ పర్ట్ అని ఇదివరకే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. ఆయుధాల డంపింగ్ బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. చిన్న వయసులోనే పార్టీలో చేరిన ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీకి కీలకమైన కేంద్ర కమిటీలో 2014లో సభ్యుడిగా నియామకం పొందారు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో విస్తరించిన దట్టమైన దండకారణ్యం అడవులను కేంద్రంగా చేసుకుని మావోయిస్టు కార్యకలాపాలను 3 రాష్ట్రాలకు విస్తరింపజేయడంలో రమణ కీలక పాత్ర పోషించారని చెప్తుంటారు. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఛత్తీస్ గఢ్ సహా మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఒడిశాలోని మల్కన్ గిరి ప్రాంతాలకు మావోయిస్టు కార్యకలాపాలను విస్తరింపజేయడంలో ఆయన సక్సెస్ అయ్యారని అంటుంటారు.