సంక్షోభాల మధ్య సంస్మరణ..మావోయిస్టు ఇలాకాల్లో హై అలర్ట్

సంక్షోభాల మధ్య సంస్మరణ..మావోయిస్టు ఇలాకాల్లో హై అలర్ట్
  • నేటి నుంచి మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

భద్రాచలం, వెలుగు : సంక్షోభాల నడుమ సంస్మరణ వేడుకలకు మావోయిస్టు పార్టీ సిద్ధమైంది. సోమవారం నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సావాలు నిర్వహిస్తోంది. 2025 ఆరు నెలల్లో 16 ఎన్​కౌంటర్లలో 206 మంది మావోయిస్టులు మరణించడంతో  ఆ పార్టీకి షాక్​ తగిలింది. తొలిసారిగా పార్టీ చీఫ్​ నంబాల కేశవరావు అలియాస్​ బస్వరాజ్​ లాంటి అగ్రనేతను పార్టీ కోల్పోయింది. ఎన్​కౌంటర్లలో మొత్తం 13 మంది అగ్రనేతలు నేలకొరగడం ఆందోళన కల్గిస్తోంది. 

నంబాల కేశవరావు, జయరాం, రేణుక, మధు, నీతి, రూపేశ్, దస్రూ, రణధీర్, జోగన్న, సుధాకర్​ అలియాస్​ తెంటు లక్ష్మీనర్సింహాచలం, భాస్కర్​ అలియాస్​ అదెల్లు, గాజర్ల రవి, అరుణు చనిపోయారు. ఒక్క ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా వివిధ ఎన్​కౌంటర్లలో 357 మంది ఎన్​కౌంటర్లలో మృతి చెందారు. వీరినందరినీ స్మరించుకుంటూ అమరవీరుల వారోత్సవాలు గ్రామ గ్రామాన నిర్వహించాలని ఇటీవలే కేంద్ర కమిటీ ఒక లేఖను విడుదల చేసింది. పార్టీ అగ్రనేత చారుమజుందార్​ 1972లో జైలులో కన్నుమూసిన జులై 28వ తేదీన ఏటా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. 

కగార్​తో కకావికలమైన వేళ..

ఆపరేషన్​ కగార్​తో కకావికలమైన వేళ మావోయిస్టులు తిరిగి పార్టీ శ్రేణుల్లో జోష్​ను నింపేందుకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను వేదికగా చేసుకున్నారు. అమరవీరులను స్మరించుకుంటూ స్తూపాలు నిర్మించి, సభలు జరిపి  నివాళి అర్పించాలని గ్రామస్థాయి కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. ఏటా దండకారణ్యంలో ఈ సంస్మరణోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆపరేషన్​ కగార్​తో దళాలు చెల్లచెదురై  చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సంస్మరణ సభల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు వర్షాకాలంలోనూ ఆపరేషన్​ కగార్​ను కొనసాగించేలా కేంద్ర హోంశాఖ పటిష్ట కార్యాచరణతో కూంబింగ్​నిర్వహిస్తోంది. 

బీజాపూర్, నారాయణ్​పూర్​ జిల్లాలలో ఈ నెలలో రెండు ఎన్​కౌంటర్ల ద్వారా 10 మంది నక్సల్స్ ను హతమార్చారు. అడవిలో ప్రతీ ఐదు కిలో మీటర్లకు ఒక బేస్​ క్యాంపు, నిత్యం పోలీసుల పహారా నడుమ వారి కళ్లను కప్పి సభలు నిర్వహించడం మావోయిస్టులకు సవాలే. ఆపరేషన్​ కర్రెగుట్టలు, అబూజ్​మాడ్​ పేరిట వేల సంఖ్యలో జవాన్లు అడవులను జల్లెడ పడుతున్నారు. దీనికి తోడు మావోయిస్టు అగ్రనేతల కదలికలు తమ గుప్పిట్లోనే ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖ ప్రకటించడం కూడా కలకలం రేపుతోంది. 

హై అలర్ట్... 

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర హోంశాఖ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని హై అలర్ట్ ప్రకటించింది. ఎదురుదెబ్బలతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు దాడులకు దిగే అవకాశాలు లేకపోలేదంటూ నిఘవర్గాలు హెచ్చరిస్తున్నాయి. తెలంగాణ, ఏపీ, చత్తీస్​గఢ్​, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి కేంద్ర బలగాలు మావోయిస్టుల వ్యూహాత్మక దాడులను ఎదుర్కొనేందుకు సిద్దమయ్యాయి. నిఘా పెంచి, నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణలో ప్రధానంగా ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలతో పాటు ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్​ జిల్లాల్లోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. 

గోదావరి తీరం వెంబడి నిఘాను పెంచారు. ఎలాంటి ప్రతిఘటనలనైనా ఎదుర్కొనేందుకు భద్రతాబలగాలు సిద్ధమయ్యాయి. అటు నక్సల్స్, ఇటు భద్రతాబలగాల కదలికలతో గిరిజన గ్రామాలు వణికిపోతున్నాయి. ప్రధానంగా హిట్​లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల హెచ్చరికలతో పలువురు పట్టణాలకు వలసబాట పట్టారు. రాత్రి వేళల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని రూట్లో ఆర్టీసీ సర్వీసులను రద్దు చేసుకుంటుంది. వారోత్సవాల వేళ ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది.