40 ఏళ్ల తర్వాత మంథనికి మావోయిస్టు రాజిరెడ్డి

40 ఏళ్ల తర్వాత మంథనికి మావోయిస్టు రాజిరెడ్డి

మంథని, వెలుగు: ఉద్యమం తమ నుంచి దూరమైనా తాము ఉద్యమానికి దూరం కాలేదని, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాటం చేస్తామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న అలియాస్ సంగ్రామ్ తెలిపారు. 40 ఏళ్ల తర్వాత పెద్దపల్లి జిల్లా మంథనికి ఆయన శనివారం వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తుందనే నమ్మకం ప్రస్తుతం తమకు లేదన్నారు.

ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేస్తే ప్రజా సమస్యల కోసం చట్టబద్ధంగా పోరాటం చేసే విషయంపై అందరి అభిప్రాయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థను దగ్గరుండి పరిశీలిస్తున్నామని, ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన కూడా లేదన్నారు. మళ్లీ వచ్చినప్పుడు తన స్వగ్రామమైన శాస్త్రులపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని చెప్పారు.