గంజాయి గ్యాంగ్ బరితెగించింది. గంజాయి మత్తులో కన్నూమిన్నూ ఆడటం లేదు.. పోలీసులను లెక్కచేయకపోవటం ఒకటి అయితే.. ఏకంగా పోలీసులను చంపాలని చూడటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ సిటీ శివార్లలో.. 2026, జనవరి 24వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఘటన పోలీస్ శాఖనే షేక్ చేసింది. గంజాయి గ్యాంగ్ వెళుతున్న కారును అడ్డుకోబోయిన లేడీ కానిస్టేబుల్ సౌమ్యను.. కారుతో ఢీ కొట్టి మరీ పారిపోయారు గంజాయి గ్యాంగ్. పూర్తి వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ నగర శివారులో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. నేరస్తులను పట్టుకునేందుకు వచ్చిన ఎక్సైజ్ సిబ్బంది పై కారుతో ఢీ కొట్టి పారిపోయారు దుండగులు. మాదవనగర్ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ తిరుగుతున్నట్లు ఎక్సైజ్ సీఐ స్వప్నకు సమాచారం వచ్చింది. స్థానికుల సమాచారంతో నిందితుల కోసం రోడ్ వాచ్ చేస్తున్న ఎక్సైజ్ పోలీసు సిబ్బంది... కారును ఆపే ప్రయత్నం చేశారు.
గంజాయి మత్తులో ఉన్న గ్యాంగ్ పోలీసులపై కారుతో ఢీ కొట్టి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికి ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ ను ఢీకొట్టిన దుండగులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను నిర్మల్ జిల్లా బుధవార్ పేట, వైఎస్ ఆర్ కాలానికి చెందిన సఫీయుద్ధిన్, సయ్యద్ సోహెల్ గా గుర్తించారు.
విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందినే చంపాలని చూసిన ఘటనపై పోలీసు శాఖ సీరియస్ గా ఉంది. యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు శక్తి వంచన లేకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలసులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తేనే ఇంతటి దారుణానికి తెగబడరు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.
