జనవరి 15న స్టాక్ మార్కెట్ల పనితీరులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీనికి మహారాష్ట్రలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కారణంగా తెలుస్తోంది. ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నందున మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రోజును నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఈ ప్రభావం నేరుగా ఫైనాన్షియల్ మార్కెట్లపై పడింది.
ఈ క్రమంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ జారీ చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం.. జనవరి 15న ఈక్విటీ, కమోడిటీ విభాగాల్లో యధావిధిగా ట్రేడింగ్ జరుగుతుంది. అయితే డెట్, కరెన్సీ సెగ్మెంట్లు మాత్రం పూర్తిగా మూతపడనున్నాయి. ట్రేడింగ్ సాధారణంగా సాగినప్పటికీ, ఆ రోజును 'సెటిల్మెంట్ హాలిడే'గా పరిగణించనున్నారు. సాధారణంగా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ జరిగినప్పుడు.. క్యాష్ అండ్ స్టాక్ ట్రాన్స్ ఫర్ ప్రక్రియను సెటిల్మెంట్ అంటారు. దీనికోసం బ్యాంకుల పనితీరు చాలా ముఖ్యం. జనవరి 15న బ్యాంకులకు సెలవు ఉన్నందున.. ఆ రోజు సెటిల్మెంట్ ప్రక్రియ జరగదు. అందువల్ల జనవరి 14, జనవరి 15 తేదీల్లో అంటే రెండు రోజులు జరిగే ట్రేడ్లకు సంబంధించిన సెటిల్మెంట్ ప్రక్రియ అంతా తిరిగి జనవరి 16 తేదీన మాత్రమే పూర్తవుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లు తమ ఖాతాల్లో షేర్లు లేదా నగదు జమ కావడానికి ఒకరోజు వేచి చూడాల్సి ఉంటుంది.
సాధారణంగా స్టాక్ మార్కెట్ సెలవుల క్యాలెండర్‌ను ముందుగానే ఇస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అకస్మాత్తుగా ప్రకటించే ఎన్నికల సెలవుల వంటి అన్ ప్లాన్డ్ ఈవెంట్స్ వల్ల ఎక్స్ఛేంజీలు చివరి నిమిషంలో ఇటువంటి మార్పులు చేయాల్సి వచ్చింది. దీనికి అనుగుణంగానే ఆక్షన్ ట్రేడ్, సెటిల్మెంట్ సమయాలను కూడా ఎక్స్ఛేంజీలు సవరించాయి. ఇన్వెస్టర్లు ఈ మార్పులను గమనించి తమ ట్రేడింగ్ ప్లాన్ రూపొందించుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆప్షన్స్ రైటింగ్ చేసేవారు, ఇంట్రాడే ట్రేడర్లు ఈ సెటిల్మెంట్ ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
