- సెన్సెక్స్ 919 పాయింట్లు జంప్
- నిఫ్టీ 275 పాయింట్లు అప్
- ఇన్వెస్టర్లకు రూ.6.4 లక్షల కోట్ల లాభం
ముంబై:స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకు షేర్లలో ర్యాలీ వల్ల సెన్సెక్స్ 919 పాయింట్లు పెరిగి 77,550 వద్ద నిలిచింది. నిఫ్టీ 275 పాయింట్ల లాభంతో 24,050 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.6.4 లక్షల కోట్లు పెరిగి రూ.451 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్షేర్లలో ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఇండిగో, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు 2–4 శాతం లాభపడ్డాయి.
టీసీఎస్ నాలుగో క్వార్టర్ ఫలితాల ప్రభావంతో టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ షేర్లు మూడు శాతం వరకు నష్టపోయాయి. సన్ ఫార్మా షేర్లు దాదాపు 4 శాతం క్షీణించాయి. మార్కెట్లో భయాన్ని సూచించే ఇండియా విక్స్ ఎనిమిది శాతం తగ్గి 18.85 వద్దకు చేరింది. నిఫ్టీ ఆటో మూడు శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ రెండు శాతానికిపైగా పెరిగాయి. నిఫ్టీ ఐటీ రెండు శాతం తగ్గింది. ఎన్ఎస్ఈలో 2,667 షేర్లు లాభపడగా, 575 షేర్లు నష్టపోయాయి. 100 షేర్లలో మార్పు లేదు.
అదుపులో చమురు ధరలు
చమురు ధరలు100 డాలర్ల లోపే ట్రేడవుతున్నాయి. గత నెల వంద డాలర్లు దాటిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టడం మార్కెట్ కు కలిసొచ్చింది. జపాన్ నిక్కీ 2 శాతం, కొరియా కోస్పీ ఒక శాతం పెరిగాయి. చైనా షాంఘై, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ లాభపడ్డాయి. యూరప్ లోని డాక్స్, సీఏసీ, ఎఫ్టీఎస్ఈ కూడా లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం సానుకూలంగా ముగిశాయి. రూపాయి విలువ మాత్రం 32 పైసలు తగ్గి 92.83 వద్దకు చేరింది.
గత వారం 95 స్థాయిని తాకిన రూపాయి, ఆర్బీఐ తీసుకున్న చర్యల కారణంగా కోలుకుంటోంది. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐలు గురువారం రూ.1711 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. నిఫ్టీకి 23,800 వద్ద మద్దతు ఉందని, 24,300 నుంచి 24,350 వరకు ప్రతిఘటన ఎదురు కావొచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ పేర్కొంది. 24,200 నుంచి 24,250 స్థాయిని దాటితే నిఫ్టీ 24,400 నుంచి 24,600 వరకు వెళ్లే అవకాశం ఉందని ఎస్బీఐ సెక్యూరిటీస్ తెలిపింది.
