- మరో రూ.3,200 కోట్ల షేర్లు అమ్మిన విదేశీ ఇన్వెస్టర్లు
- డాలర్‌తో 92 స్థాయికి పతనమైన రూపాయి
- పెరిగిన క్రూడాయిల్ ధరలు..
- వెండి రూ.20 వేలు అప్
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం మళ్లీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ దాదాపు ఒక శాతం మేర పతనమయ్యాయి. అన్ని రంగాల ఇండెక్స్‌లు రెడ్‌లో ముగిశాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోవడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. షేర్లు వంటి రిస్కీ ఆస్తుల నుంచి సేఫ్-హేవన్ ఆస్తుల వైపు పెట్టుబడిదారులు వెళుతున్నారని, దేశీయంగా ఎటువంటి మేజర్ ఈవెంట్లు లేకపోవడంతో కూడా మార్కెట్ పడుతోందని ఎనలిస్టులు తెలిపారు.
విదేశీ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐల) అమ్మకాలు కొనసాగుతుండడం మార్కెట్‌ను మరింత బలహీనపరిచిందని అన్నారు. 30-షేర్ల సెన్సెక్స్ శుక్రవారం 770 పాయింట్లు (0.94శాతం) పడిపోయి 81,538 వద్ద ముగియగా, ఇంట్రాడేలో ఇది 835.55 పాయింట్లు (1.01శాతం) తగ్గి 81,471.82 వరకు పతనమైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 241.25 పాయింట్లు (0.95శాతం) తగ్గి 25,048.65 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 264.6 పాయింట్లు (1.04శాతం) పతనమై 25,025.30 వరకు నష్టపోయింది.
ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్క సెషన్‌లోనే రూ.5.70 లక్షల కోట్లు తగ్గింది. సెన్సెక్స్‌లో అదానీ పోర్ట్స్, ఎటర్నల్, ఇండిగో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎస్‌బీఐ, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, ట్రెంట్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిశాయి. మరోవైపు టెక్ మహీంద్రా, హిందుస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో నిలిచాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీ 2.19శాతం పడగా, మిడ్‌క్యాప్ 1.56శాతం తగ్గింది. ఎఫ్‌ఐఐలు గురువారం నికరంగా రూ.2,549.80 కోట్ల షేర్లను విక్రయించగా, శుక్రవారం మరో రూ.3,200 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
‘‘గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి రికార్డు కనిష్టానికి పడిపోవడం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు, కార్పొరేట్ క్యూ3 ఫలితాలు అంచనాలకు కొద్దిగా తక్కువగా రావడంతో భారత మార్కెట్లు పడుతున్నాయి. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. అమెరికా రెగ్యులేటర్ సమన్లు వచ్చే అవకాశం ఉన్న వార్తలతో అదానీ గ్రూప్ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్నాయి”అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు. యూనియన్ బడ్జెట్, అమెరికా ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తారని అన్నారు. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ, షాంఘై ఎస్‌ఎస్‌ఈ, కొరియా కోస్పి, హాంకాంగ్ హాంగ్ సాంగ్ శుక్రవారం లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
బంగారం, వెండి ధరలు పైపైకి
బంగారం, వెండి ధరలు శుక్రవారం కొత్త రికార్డు స్థాయికి చేరాయి. అమెరికా డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ తగ్గింపు అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లలో ధరలను పెంచా యి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర హైదరాబాద్‌లో శుక్రవారం రూ.2,840 పెరిగి రూ.1,57,150 కి చేరింది. కేజీ వెండి ధర రూ.20 వేలు ఎగిసి రూ.3,60,000 ను తాకింది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.15 వేలు పెరిగి రూ.3.40 లక్షలకు చేరగా, గోల్డ్ ధర రూ.2,840 పెరిగి రూ.1,57,300 కి చేరింది.
ఆగని రూపాయి పతనం
డాలర్‌తో రూపాయి శుక్రవారం రికార్డు కనిష్టమైన 92 స్థాయికి పడిపోయింది. చివరికి 91.88 లెవెల్ వద్ద సెషన్‌ను ముగించింది. విదేశీ పెట్టుబడులు మార్కెట్ నుంచి వెళ్లిపోతుండడం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, అమెరికా ట్రెజరీ యీల్డ్స్ పెరగడం రూపాయిపై ఒత్తిడి తెచ్చాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్‌లో రూపాయి శుక్రవారం డాలర్ మారకంలో 91.45 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 92.00 వద్ద జీవిత కాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ నెలలో రూపాయి 200 పైసలు (2శాతం) పతనమైంది. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ 1.03శాతం పెరిగి బ్యారెల్‌కు 64.72 వద్ద ట్రేడవుతోంది.
