తలసాని రాజకీయ పబ్బం కోసమే బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో చందా బోర్డులు : మర్రి శశిధర్ రెడ్డి 

తలసాని రాజకీయ పబ్బం కోసమే బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో చందా బోర్డులు : మర్రి శశిధర్ రెడ్డి 

హైదరాబాద్ : బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ.5 లక్షల చందా ఇచ్చినట్లు ఏర్పాటు చేసిన బోర్డులను తక్షణమే తొలగించాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా.. రాజకీయ పబ్బం కోసం మంత్రి తలసాని ఆలయం వద్ద బోర్డులను ఏర్పాటు చేయించారని, దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. రేణుక ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి మంత్రి తలసాని రూ.5 లక్షల చందా ఇచ్చినట్లు పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేశారని, అయితే.. చందాదారుల పేర్లలో తలసాని పేరు లేదని ఆరోపించారు. ఆలయ ఈవో స్పందించి.. ఆ బోర్డులను వెంటనే తొలగించాలని.. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. 

జూన్ 20న రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మంత్రి తలసాని ఉమ్మివేయడం.. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయన్నారు. దీనిపై హిందువులకు మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో మంత్రి ఉమ్మి వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అమ్మవారి ఆగ్రహానికి మంత్రి గురికాక తప్పదని మర్రి శశిధర్ రెడ్డి హెచ్చరించారు. బర్కత్ పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో మర్రి శశిధర్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని తీవ్ర స్థాయిలో అడ్డుకుంటామని హెచ్చరించారు.  

ఎస్ఆర్ నగర్ పోలీసులు అధికార పార్టీ (బీఆర్ఎస్)కి ఒత్తాసు పలుకుతున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలని హితవుపలికారు. హిందూవుల మనోభావాన్ని దెబ్బతీసిన మంత్రి తలసానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.