జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి

జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి

మాజీ మంత్రి, సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇవాళ బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. బీజేపీలో చేరిక నేపథ్యంలో గురువారమే మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి సహా పలువురు ముఖ్య నేతలు ఆయనను తీసుకుని వెళ్లారు. మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరిక కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్ర నేతలు బీజేపీ పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఫాం హౌస్ వ్యవహారం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసుల అంశంతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను వారు హైకమాండ్ కు వివరించే అవకాశముంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర అంశం కూడా ప్రస్తావనకు వచ్చే ఛాన్సుంది. ఇటీవల జరిగిన శిక్షణా తరగతులు, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర నేతలు అధిష్టానానికి తెలపనున్నారు.