కట్నం కోసం భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష

కట్నం కోసం భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష
  •     నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
  •     రూ.30 వేల కోసం భార్యను చిత్రహింసలు పెట్టిన ఇమ్రాన్‌‌‌‌
  •     కత్తితో గొంతు కోసి.. సుత్తితో కిరాతకంగా కొట్టి హత్య
  •     2019 జనవరిలో హైదరాబాద్‌‌‌‌ పాతబస్తీలో ఘటన


హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వరకట్నం కోసం భార్యను వేధించి, అతి కిరాతకంగా హత్య చేసిన వ్యక్తికి నాంపల్లి కోర్టు ఉరి శిక్ష విధించింది. రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. గురువారం ఈ మేరకు నాంపల్లి నాలుగో అడిషనల్‌‌‌‌ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సీవీఎస్ సాయి భూపతి ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్‌‌‌‌ పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్‌‌‌‌ పరిధిలోని తలాబ్‌‌‌‌కట్టకు చెందిన ఇమ్రాన్‌‌‌‌ ఉల్‌‌‌‌ హక్‌‌‌‌ (38).. క్యాబ్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌గా పని చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన నసీం అక్తర్‌‌‌‌ ‌‌‌‌(35)తో వివాహం జరిగింది. వీరికి నలుగురు అమ్మాయిలు పుట్టారు. దీంతో కట్నం కోసం నసీంను ఇమ్రాన్ తరుచూ వేధించేవాడు. నసీం సోదరులు అనేక మార్లు ఇమ్రాన్‌‌‌‌కు నచ్చజెప్పారు. అయినా మారని అతడు.. కారు కొనేందుకు డబ్బులు కావాలని, రూ.30 వేలు తీసుకురావాలంటూ భార్యను తీవ్రంగా కొట్టేవాడు. పైగా ఎలాంటి పనులు చేసే వాడు కాదు. 

ఈ నేపథ్యంలోనే చంచల్‌‌‌‌గూడ చౌనికి చెందిన మైమూన సుల్తానను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాతి నుంచి వేధింపులు మరింత పెంచాడు. ఈ క్రమంలో 2019 జనవరి 6న సాయంత్రం 6.15 గంటల సమయంలో నసీంపై దాడి చేశాడు. పదునైన కత్తితో ఆమె గొంతు కోశాడు. ఎడమ చేతి బొటన వేలు, మడమపై సుత్తితో దాడి చేశాడు. తల, మర్మాంగాలను స్క్రూ డ్రైవర్‌‌‌‌‌‌‌‌తో ఛిద్రం చేశాడు. దీంతో నసీం అక్కడికక్కడే మృతి చెందింది. నసీం సోదరుడు మహ్మద్ మజహరుద్దీన్‌‌‌‌ ఫిర్యాదు మేరకు భవానీనగర్ పోలీసులు 498(ఏ), 302 సెక్షన్ల కింద  కేసు నమోదు చేశారు. దర్యాప్తును పూర్తి చేసి.. సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారు. నాలుగో అడిషనల్‌‌‌‌ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో విచారణ జరిగింది. ఇమ్రాన్‌‌‌‌పై నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష విధిస్తూ జడ్జి సీవీఎస్ సాయి భూపతి తీర్పు వెల్లడించారు.