- ఎర్రవల్లిలో అమరవీరుల కాలనీ నిర్మిస్తామన్న సీఎం ప్రకటనపై అమరుల కుటుంబాల హర్షం
- భూములు దోచుకున్న దొంగలపై మరో ఉద్యమం చేస్తాం: అద్దంకి దయాకర్
- కల్వకుంట్ల కుటుంబమే భూముల వివరాలు వెల్లడించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఎర్రవల్లిలో తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో అమరవీరుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. గన్‌పార్క్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశాయి. అమరవీరుల గుర్తింపు కమిటీ సభ్యులు అద్దంకి దయాకర్, రాములు నాయక్ ఆధ్వర్యంలో బుధవారం అమరుల కుటుంబాలు అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయం నుంచి గన్‌పార్క్‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణలో భూములు దోచుకున్న దొంగలపై మరో ఉద్యమం చేస్తామన్నారు.
కల్వకుంట్ల కుటుంబం భూముల వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి బయటపెట్టక ముందే వారే స్వచ్ఛందంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. పేదలకు దక్కాల్సిన భూములు బీఆర్‌ఎస్ నేతలు, కేసీఆర్ బినామీలకు ఎలా దక్కాయని ప్రశ్నించారు. కేసీఆర్‌కు తెలియకుండా ఎర్రవల్లిలోని 45 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందని నిలదీశారు. ఎర్రవల్లిలో అమరవీరుల స్థూపం, కాలనీ నిర్మిస్తే కేసీఆర్‌కు నిరంతరం అమరవీరులు గుర్తుకొస్తారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులైన కోదండరాం, మంద కృష్ణ మాదిగ, తనను జైల్లో పెట్టిన కేసీఆర్.. ఉద్యమ ద్రోహులను మాత్రం ఇంట్లో కూర్చోబెట్టి బిర్యానీ తినిపించారని ఆరోపించారు.
రాములు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ధరణి పేరుతో మూడు లక్షల ఎకరాల భూమిని దోచుకున్నారని ఆరోపించారు. ఇందిరాగాంధీ దళితులకు ఇచ్చిన భూమిని కేసీఆర్ మాయం చేశారని ఆరోపించారు. సీఎంగా పనిచేసిన వ్యక్తులు దళితుల భూములు, ఇతర ప్రభుత్వ భూములను ఆక్రమించడం దారుణమన్నారు.
