
- తమను పిలువలేదంటూ అమరుల కుటుంబాల కన్నీళ్లు
- తమను పిలువలేదంటూ అమరుల కుటుంబాల కన్నీళ్లు
- సచివాలయం వద్ద నిరసన చేసినందుకు అరెస్టు చేసిన పోలీసులు
- డ్రోన్ షోలోనూ కనిపించని అమరవీరుల ఫొటోలు
- ముగిసిన రాష్ట్ర దశాబ్ది వేడుకలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు నిర్మించిన ‘అమరుల స్మారక చిహ్నాం’ ప్రారంభోత్సవానికి అమరుల కుటుంబ సభ్యులనే రానివ్వలేదు. ఈ వేడుకకు ఆరుగురి కుటుంబాలనే ఆహ్వానించిన ప్రభుత్వం.. తమను విస్మరించిందని ఎంతో మంది అమరుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొందరినే గుర్తించిందని, సాయం కొందరికే అందిందని, ఇదెక్కడి న్యాయమని వాపోయారు. గురువారం సచివాలయం వద్ద నిరసన చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అమరుల కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. 21 రోజులపాటు నిర్వహించిన రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ముగియగా.. కోట్లు ఖర్చు చేసిన వేడుకలతో తమకు ఏం ఒరిగిందని అమరుల కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.
సొంత ప్రచారానికే ప్రాధాన్యం
కేసీఆర్‌కు మైలేజీ తేవడం.. సర్కారును కీర్తించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎటుచూసినా గులాబీ జెండాలతో తమ పార్టీ ప్రచారానికే ప్రాధాన్యతనిచ్చారు. ప్రభుత్వ నిధులతో మస్తు ప్రచారం చేసుకున్నారు. అధికార పార్టీ లీడర్లు, కార్యకర్తలతో సభను నింపే ప్రయత్నం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో సభాస్థలికి భారీగా వచ్చారు. అంబేద్కర్ విగ్రహం నుంచి తీసిన ర్యాలీలోనూ వాళ్లే పాల్గొన్నారు. అంబేద్కర్ సెక్రటేరియెట్ పరిసర ప్రాంతాల్లో, అమరవీరుల స్మారక కేంద్రం దగ్గర మొత్తం గులాబీ ఫ్లెక్సీలనే పెట్టారు. ఈ సభ కోసం దాదాపు వెయ్యిమందికి పైగా పోలీసులను బందోబస్తుకు పెట్టారు. చుట్టుపక్కల ఎక్కడా అమరుల కుటుంబాల నుంచి, విపక్షాల నుంచి నిరసన కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
శ్రీకాంతాచారి పేరును ప్రస్తావించని సీఎం
సీఎం కేసీఆర్ తన స్పీచ్‌లో కనీసం ఎక్కడా శ్రీకాంతాచారి పేరును ప్రస్తావించలేదు. ఉద్యమకారుల ప్రస్తావన పెద్దగా తీసుకురాలేదు. 15 నిమిషాల డ్రోన్ షోలోనూ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలను ప్రస్తావించలేదు. కేసీఆర్, టీ హబ్, కాళేశ్వరం, అమరవీరుల స్మృతి చిహ్నం, కొత్త సెక్రటేరియెట్, చార్మినార్, బతుకమ్మ, కాకతీయ కళాతోరణం, తెలంగాణ మ్యాప్, పాలపిట్ట మాత్రమే డ్రోన్ షోలో చూపెట్టారు. అమరుల ఫొటో ఒక్కరిది కూడా వేయలేదు.
అమరుల కుటుంబాలకు ఒరిగిందేంటి?
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల పేరిట ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇందులో 21 రోజుల పాటు ప్రతిరోజు ఒక దినోత్సవం, ఆ వేడుకల యాడ్స్ కోసం పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనలన్నింటిలో అధికార పార్టీని ప్రతిబింబించేలా డిజైన్లు చేసి ప్రమోట్ చేసుకున్నారు. నేషనల్ మీడియా చానళ్లు, పేపర్లతో పాటు ఆయా రాష్ట్రాల్లో ప్రధాన న్యూస్ పేపర్లకు ప్రకటనలు ఇచ్చారు. ‘తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రగతి పుస్తకం.. దేశానికి ఆదర్శం’ పేరుతో స్పెషల్‌గా ప్రకటనలు, వీడియోలు కూడా రెడీ చేశారు. ఈ వీడియోల కోసం కూడా రూ.50 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు తెలిసింది. ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టే బదులు.. అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసినా బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1,500 మంది అమరుల కుటుంబాలకు సాయం అందాల్సి ఉంటే.. సగం కూడా ఇవ్వకుండా వివరాలు అందలేదని తప్పించుకోవడంపై అమరుల కుటుంబాలు మండిపడుతున్నాయి.