న్యూఢిల్లీ: ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియాతో సుజుకీ మోటార్ గుజరాత్ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. ఈ విలీనాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 1న ఆఫీషియల్‌గా ప్రకటించారు. ఢిల్లీ ఎన్‌సీఎల్‌టీ ప్రధాన బెంచ్, రెండు కంపెనీలు కలిసి వేసిన పిటీషన్‌ను పరిశీలించింది.
వీటి షేర్‌హోల్డర్లు, ఉద్యోగులు, క్రెడిటర్లు తదితరుల ప్రయోజనాల దృష్ట్యా ఎటువంటి అడ్డంకులు లేవని పేర్కొంది. ఇన్‌కమ్ ట్యాక్స్, ఆర్‌బీఐ, సెబీ, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వంటి అధికార సంస్థలు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. దీంతో ఇక నుంచి సుజుకీ మోటార్ గుజరాత్ అనే కంపెనీ ఉండదు. ఈ విలీనంతో వ్యాపారం విస్తరించడానికి వీలుంటుందని, ఖర్చుల తగ్గుతాయని, నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి.
సుజుకీ మోటార్ గుజరాత్‌లో ఉన్న ఉద్యోగులు మారుతి సుజుకీ ఇండియాలో కొనసాగుతారు. కాగా, జపనీస్ కంపెనీ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కి మారుతి సుజుకీ ఇండియాలో 58.28శాతం వాటా ఉంది.
