భారత ఆటోమొబైల్ రంగంలో కొన్ని దశాబ్దాల పాటు చిన్న కార్ల హవా నడిచింది. ఒకదాని తరువాత మరో మోడల్ సత్తా చాటాయి. మారుతి సుజుకి 800, హ్యుందాయ్ సాంట్రో, టాటా ఇండికా వంటి మోడళ్లు సాధారణ మధ్యతరగతి కుటుంబాల ప్రయాణానికి నమ్మదగినవిగా పేరు గాంచాయి. కానీ ఈ సిరీస్‌లో ఒక కారు మాత్రం అసాధారణ విజయాన్ని అందుకుంది. అదే మారుతి సుజుకీ ఆల్టో.
2000లో మారుతి సుజుకీ ఆల్టో మోడల్ ను మెుదటిసారి మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తర్వాత ఈ కారుకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 2025 వరకు మొత్తం 47 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో భారత ఆటోమొబైల్ చరిత్రలో కొత్త చరిత్రను లిఖించింది ఆల్టో తన భారీ అమ్మకాలతో. 2005 నుండి 2017 వరకు 13 సంవత్సరాలు వరుసగా దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు మోడల్ గా నిలవటం కేవలం ఆల్టోకు దక్కిన అరుదైన ఆదరణగా చెప్పుకోవాలి. 2019లో కూడా అదే కీర్తిని తిరిగి కైవసం చేసుకుంది.
2023లో కంపెనీ ఆల్టో 800 మోడల్ ఉత్పత్తిని నిలిపివేసినా.. దాదాపు 35 లక్షల యూనిట్లు విక్రయించిన తర్వాతా ఆ మోడల్ పేరు కార్‌ప్రియుల మనసుల్లో నిలిచిపోయింది. ప్రస్తుతం ఆల్టో K10 ఆ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. మారుతి సుజుకీ ఇటీవల జీఎస్టీ రేటు సవరణల తర్వాత ధరలను తగ్గించింది. ఆల్టో K10 ప్రారంభ ధర రూ. 3లక్షల 70వేలుగా ఉండగా.. దీనిలో టాప్‌వెర్షన్ ధర రూ.5లక్షల 44వేల 900గా ఉంది.
ఈ కారు 1.0 లీటర్, 3 సిలిండర్ K10C ఇంజిన్‌తో వస్తుంది. ఇది 68 భీపీ పవర్, 91 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటి గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తాయి. సీఎన్జీ వెర్షన్‌లో 56 భీపీ పవర్, 82 ఎన్ఎమ్ టార్క్ కలిగి ఉంది. ఇక ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయంలో ఆల్టో ఎప్పటిలాగే ముందుంటుంది. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 24.39 కిమీ, ఏఎంటి వెర్షన్ 24.90 లీటరుకు కిమీ, సీఎన్జీ వెర్షన్ కేజీకి33.40 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ఫీచర్ల పరంగా కూడా ఈ చిన్న కారు వినియోగదారులను ఆకట్టుకుంటుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, బహుళ ఫంక్షన్ స్టీరింగ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబిఎస్, ఈబిడి, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు వంటి ఫీచర్లు అందులో ఉన్నాయి. గతవారంలో మారుతీ సుజుకీ భారతదేశంలో మూడు కోట్ల కార్లను విక్రయించిన ఏకైక కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఇందులో ఆల్టో అగ్రగామిగా 47 లక్షల యూనిట్లతో నిలిచింది. దీని తర్వాత వాగన్ఆర్, స్విఫ్ట్ నిలిచాయి.
