Apple Store: యాపిల్ స్టోర్ను గుల్ల చేసిన లూటీ బ్యాచ్.. ఐ ఫోన్లు దోచుకుని జంప్.. వీడియోలు వైరల్ !

Apple Store: యాపిల్ స్టోర్ను గుల్ల చేసిన లూటీ బ్యాచ్.. ఐ ఫోన్లు దోచుకుని జంప్.. వీడియోలు వైరల్ !

లాస్ ఏంజెల్స్: ‘సందట్లో సడేమియా’ అనే మాట వినే ఉంటారు. దేశం ఏదైనా కొందరి మైండ్ సెట్ ఎప్పటికీ మారదు. అల్లర్లు, ఆందోళనలు జరుగుతున్నప్పుడు కొందరు ఆ బ్యాచ్లో కలిసిపోయి.. ఆందోళనల్లో భాగమైనట్లు కలరింగ్ ఇచ్చి అందినకాడికి లూటీ చేసుకుని పోతుంటారు. అమెరికాలో కూడా సరిగ్గా అదే జరిగింది. అక్రమ వలసదారుల ఏరివేత కోసం అమెరికా సర్కారు తీసుకుంటున్న బలవంతపు చర్యలకు వ్యతిరేకంగా లాస్ఏంజెల్స్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఆందోళనల్లో కొందరు లూటీ బ్యాచ్ ఎంటర్ అయి ఒక యాపిల్ స్టోర్లో చొరబడి అందినకాడికి దోచుకునిపోయారు. సోమవారం రాత్రి డౌన్టౌన్ లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ఉన్న యాపిల్ స్టోర్లోకి ఆందోళనకారుల ముసుగులో కొందరు మాస్క్ ధరించి చొరబడ్డారు. యాపిల్ స్టోర్ను కర్రలు, రాళ్లతో ధ్వంసం చేసి లోపలికి వెళ్లి యాపిల్ ఐ ఫోన్లు, యాపిల్ వాచ్లు, ఇతర యాపిల్ ప్రొడక్ట్స్ను దోచుకుని అక్కడ నుంచి ఉడాయించారు. ఈ లూటీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. సుమారు డజను మందికి పైగా యాపిల్ స్టోర్లో లూటీకి పాల్పడ్డారు. తెలివిగా మాస్క్లు పెట్టుకుని అందరూ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు ఈ లూటీ బ్యాచ్ కోసం గాలిస్తున్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి లూటీ బ్యాచ్ లు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. శ్రీలంకలో సంక్షోభం ఏర్పడినప్పుడు దేశ అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లలోకి జొరబడి ఏది దొరికితే అది దోచుకుని వెళ్లిపోయారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా దేశాన్ని వదిలి భారత్ కు వచ్చి తలదాచుకున్న సందర్భంలో కూడా లూటీ బ్యాచ్ హసీనా అధికారిక నివాసం, కార్యాలయంలోకి చొరబడి దొరికిన కాడికి దోచుకుంది. ఆఫ్ఘన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సమయంలో కూడా ఇలాంటి లూటీ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

అక్రమ వలసదారుల ఏరివేత కోసం అమెరికా సర్కారు తీసుకుంటున్న బలవంతపు చర్యలకు వ్యతిరేకంగా లాస్ఏంజెల్స్లో చెలరేగిన ఆగ్రహ జ్వాలలు, ఆందోళనలూ ఐదో రోజుకు చేరుకున్నాయి. నాలుగో రోజూ స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో నిరసనలను నియంత్రించేందుకు ప్రెసిడెంట్ డొనాల్డ్​ట్రంప్​మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో 2 వేల మంది నేషనల్‌‌ గార్ట్స్ను లాస్ ఏంజెల్స్కు పంపాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.