
రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేయగా, తాజాగా మూడో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘హుడియో హుడియో’ అంటూ సాగే పాటను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సోమవారం ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
భీమ్స్ సిసిరోలియో సాంగ్ కంపోజ్ చేయడంతోపాటు హేషబ్ అబ్దుల్ వహాబ్‌తో కలిసి ఈ పాటను పాడాడు. దేవ్ లిరిక్స్ అందించాడు. ‘నా గుండె గాలిపటమల్లే ఎగరేశావే.. నీ సుట్టు పక్కల తిరిగేలా గిరిగిశావే.. నా కంటి రెమ్మల్లో కలలకు ఎరవేశావే.. నీ కంటి చూపుల్తో కలలను ఉరితీశావే..’ అంటూ సాగిన ఈ ప్రోమో సాంగ్‌లో రవితేజ, శ్రీలీల జోడీ ఆకట్టుకుంది. రవితేజ కెరీర్‌లో ఇది 75వ చిత్రం. రవితేజ, శ్రీలీల, భీమ్స్ సిసిరోలియో కాంబోలో ‘ధమాకా’ తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.