జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాలో దుండగులు కాల్పులు జరిపి 11 మందిని బలిగొన్నారు. మరో 14 మందిని గాయపరిచారు. రాజధాని ప్రిటోరియాలోని సాల్స్ విల్లే టౌన్ షిప్ లో అనుమతిలేని బార్ లో శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘటన జరిగింది. లైసెన్స్ లేని ఓ బార్లో 25 మంది మద్యం తాగుతుండగా దుండగులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
దీంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు హాస్పిటల్ లో మరణించారని చెప్పారు. మృతుల్లో 12 ఏండ్ల వయసున్న బాలుడు, 16 ఏండ్ల బాలిక, మరో మూడేండ్ల చిన్నారి ఉన్నారని వెల్లడించారు. కాల్పులకు కారణాలు తెలియరాలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు ప్రారంభించామని చెప్పారు.
