శ్మశానంలా మారిన వెనిజులా.. ఎటు చూసిన మృతదేహాలు, కుప్పకూలిన భవనాలే..!

శ్మశానంలా మారిన వెనిజులా.. ఎటు చూసిన మృతదేహాలు, కుప్పకూలిన భవనాలే..!
  • శిథిలాల కింద వందలాది మంది
  • 10 వేల మందికి పైగానే మృతిచెంది 
  • ఉండొచ్చన్న యూఎస్‌జీఎస్
  •  
  • వందేండ్లలో ఇదే అతిపెద్ద విపత్తు 
  •     నిమిషం వ్యవధిలోనే 7.2, 7.5 తీవ్రతతో ఎర్త్ క్వేక్స్
  •     కుప్పకూలిన బిల్డింగ్స్​.. శిథిలాల గుట్టలుగా పట్టణాలు 
  •     ఎటుచూసినా శిథిలాల దిబ్బగా మారిన లా గ్వైరా స్టేట్ 
  •     సహాయక చర్యల్లోకి అంతర్జాతీయ బృందాలు
  •     జపాన్, అమెరికా, ఇండియా, 
  • నేపాల్‌లోనూ భూకంపాలు  
  • 188 మంది మృతి.. 
  • 1,520 మందికి తీవ్ర గాయాలు 

కరాకస్(వెనెజువెలా): దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించడంతో పెను విధ్వంసం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం కేవలం నిమిషం వ్యవధిలోనే వచ్చిన ఈ భూకంపాల ధాటికి దేశంలోని అనేక పట్టణాల్లో పెద్ద పెద్ద భవంతులు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. పట్టణాలు ఎటుచూసినా శిథిలాల గుట్టలుగా మారాయి. ఈ భూ ప్రళయానికి 188 మంది చనిపోగా, 1,520 మంది తీవ్రంగా గాయపడ్డారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా లా గ్వైరా రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించినట్టు తెలిపింది. అయితే, శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుపోయారని, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. 

రిక్టర్ స్కేల్‌‌‌‌‌‌‌‌పై 7.2, 7.5 తీవ్రతతో ఈ భూకంపాలు నమోదయ్యాయని, గత శతాబ్ద కాలంలోనే ఇంత భారీ భూకంపాలు, పెను విధ్వంసం ఎన్నడూ సంభవించలేదని పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది మిస్సింగ్ అయ్యారని అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. అయితే, ఈ భూకంపాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకూ ఉండొచ్చని యూఎస్ జియాలజికల్ సర్వే(యూఎస్‌‌‌‌‌‌‌‌జీఎస్) సంస్థ వెల్లడించింది.

వెనెజువెలాను కోలుకోలేని స్థాయిలో దెబ్బ తీసిన ఈ భూ విలయంపై ఆ దేశ తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూలిపోయిన భారీ కట్టడాలు, భవనాల శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను రక్షించడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని ఆమె గురువారం తెలిపారు. అత్యధికంగా ధ్వంసమైన ప్రాంతాలకు రెస్క్యూ టీమ్‌‌‌‌‌‌‌‌లను యుద్ధప్రాతిపదికన తరలిస్తున్నామని పేర్కొన్నారు. 

వెనెజువెలా దేశం పలు భూగర్భ ఫాల్ట్ లైన్ల (పగుళ్లు) సమీపంలో ఉన్నప్పటికీ, దక్షిణ అమెరికా, కరేబియన్ ప్లేట్ల మధ్య దీని భౌగోళిక స్థానం ఉండటం వల్ల లాటిన్ అమెరికాలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఇంతటి భారీ భూకంపాలు రావడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ల కోసం భారీ నిర్మాణ యంత్రాలను, క్రేన్లను అందించాల్సిందిగా ప్రైవేట్ వ్యాపార సంస్థలకు రోడ్రిగెజ్ విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్యసమితి ధృవీకరించిన అంతర్జాతీయ సహాయక బృందాలు కూడా వెనెజువెలాకు బయలుదేరాయని ఆమె తెలిపారు.

కుప్పకూలిన భవంతులు.. 

స్థానిక టీవీ చానెళ్లలో గురువారం ఉదయం ప్రసారమైన దృశ్యాలు అక్కడి భీభత్సాన్ని కళ్లకు కట్టాయి. ఒకప్పుడు గగనతలాన్ని తాకుతూ నిలిచిన బహుళ అంతస్తుల భవనాలు నేడు శిథిలాల దిబ్బల్లా మారాయి. సహాయక సిబ్బంది అత్యాధునిక యంత్రాలతో కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతుకుతున్నారు. రాజధాని నగరంలో జనమంతా రోడ్లపైనే కాలం వెళ్లదీస్తున్నారు. కూలిపోయిన ఇళ్లు, భవనాల శిథిలాల మధ్య తమ వారు ఎక్కడున్నారో తెలియక, రోదిస్తూ వెతుకులాడుతున్న దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. 

అలాగే, ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌లో షేర్ అవుతున్న వీడియోలలో.. ఆసుపత్రుల బయట, మైదానాల్లో వందలాది మంది బాధితులు భూమిపై, తాత్కాలిక బెడ్‌‌‌‌‌‌‌‌లపై చికిత్స పొందుతున్న దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, లా గ్వైరా రాష్ట్రంలో పూర్తిగా కూలిపోయిన ఒక భవనం శిథిలాల నుంచి ముగ్గురు పిల్లలను సహాయక సిబ్బంది ప్రాణాలతో బయటకు తీశారు. 

కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లో ఫోన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ లేకపోవడం వల్ల బాధితుల కుటుంబాల్లో ఆందోళన రెట్టింపయింది. ముఖ్యంగా వెనెజువెలాలో నెలకొన్న సుదీర్ఘ సంక్షోభం కారణంగా గతంలోనే దేశం విడిచి వెళ్లిన 77 లక్షల మందికి పైగా ప్రవాసులు.. స్వదేశంలో ఉన్న తమ బంధువులను సంప్రదించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. గురువారం సోషల్ మీడియాలో వేలాది మంది తమ వారి ఫోటోలను పోస్ట్ చేస్తూ, ఆచూకీ కనిపెట్టాలంటూ అభ్యర్థిస్తున్నారు.  

ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు రన్‌‌‌‌‌‌‌‌వే, భవనాలు ధ్వంసం 

భూకంపాల వల్ల రాజధాని కరాకస్‌‌‌‌‌‌‌‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్ సిగ్నల్స్ పూర్తిగా కట్ అయ్యాయి. దేశంలోనే అతిపెద్దదైన సైమన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌‌‌‌‌‌‌‌వే, భవనాలు దెబ్బతినడంతో విమాన సర్వీసులను రద్దు చేశారు. సబ్‌‌‌‌‌‌‌‌వే రైలు సేవలు నిలిపివేశారు. ప్రమాదాలు జరగకుండా ఇండ్లకు గ్యాస్ సరఫరాను ఆపేశారు.

డిజాస్టర్ జోన్‌‌‌‌‌‌‌‌గా లా గ్వైరా.. 

భూ విపత్తు నేపథ్యంలో వెనెజువెలా ప్రజలను ఉద్దేశించి తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగెజ్ బుధవారం అర్ధరాత్రి ప్రసంగిస్తూ.. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి (స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ) ప్రకటించారు. భూకంపం వల్ల దెబ్బతిన్న ఆసుపత్రులు, ఇళ్ల పునర్నిర్మాణం కోసం 200 మిలియన్ డాలర్లతో అత్యవసర నిధిని ఏర్పాటు చేస్తున్నామని, దీనిని ఆర్థిక మంత్రి పర్యవేక్షిస్తారని ఆమె తెలిపారు. ఈ భూకంపాలతో దేశంలోని అన్ని ప్రాంతాల కంటే లా గ్వైరానే అత్యధికంగా విధ్వంసానికి గురైందని వెల్లడించారు. 

ఈ ప్రాంతాన్ని ‘డిజాస్టర్ జోన్’గా ప్రకటించారు. ఇక్కడ వందలాది భవనాలు కుప్పకూలిపోయాయని, దేశంలోనే అత్యధికంగా ప్రాణనష్టం ఇక్కడే సంభవించిందన్నారు. పగటి వెలుతురు ఉన్నప్పుడే శిథిలాల కింద చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ కాపాడాలనే లక్ష్యంతో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రెస్క్యూ టీమ్‌‌‌‌‌‌‌‌లను లా గ్వైరాకు తరలిస్తున్నట్లు ఆమె తెలిపారు.   

పొరుగు దేశాలపైనా ప్రభావం

వెనెజువెలాలో సంభవించిన భూకంపాల ప్రభావంతో దాని పొరుగు దేశాల్లోనూ స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. కరాకస్‌‌‌‌‌‌‌‌కు దాదాపు 1,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్‌‌‌‌‌‌‌‌లోని అమెజాన్ ప్రాంతంలో సైతం భవనాలు ఊగడంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. కొలంబియాలోని కరేబియన్, ఈశాన్య ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మొదట సునామీ అలర్ట్‌‌‌‌‌‌‌‌లు జారీ చేసినప్పటికీ, ప్రమాదం లేకపోవడంతో వాటిని వెంటనే ఉపసంహరించుకుంది.

ముందే అలర్ట్ చేసిన గూగుల్

వెనిజులాలో సంభవించిన తీవ్ర భూకంపం సమయంలో గూగుల్ తన ఆండ్రాయిడ్ అలర్ట్ సిస్టమ్ ద్వారా ముందే ప్రజలను హెచ్చరించి పలువురి ప్రాణాలు కాపాడింది. నిజానికి గూగుల్ భూకంపాలను ముందే గుర్తించలేదు, కానీ అది మొదలైన మరుక్షణమే గుర్తించి కాంతి వేగంతో అలర్ట్‌‌లు పంపింది. అదెలాగంటే.. ఆండ్రాయిడ్ ఫోన్‌‌లోని 'అక్సెలెరోమీటర్' సెన్సార్​కు భూమిలో వచ్చే సూక్ష్మ ప్రకంపనలను పసిగట్టే శక్తి ఉంటుంది. 

ఒకే ప్రాంతంలోని వేలాది ఫోన్లు ఒకేసారి ఈ కదలికలను గుర్తించినప్పుడు, ఆ డేటాను గూగుల్ సర్వర్లు క్షణాల్లో విశ్లేషించి భూకంపంగా నిర్ధారిస్తాయి. భూకంప తరంగాల వేగం కంటే ఇంటర్నెట్ సిగ్నల్స్ వేగం చాలా ఎక్కువ. ఈ వ్యత్యాసం వల్ల, భూకంపం సృష్టించే అసలైన వినాశకర తరంగాలు ప్రజలను చేరేలోపే (దాదాపు 30 సెకన్ల ముందే) గూగుల్ ఫోన్లకు హెచ్చరికలను పంపగలిగింది. ఈ వ్యవధి ప్రజలు జాగ్రత్తపడేందుకు సహాయపడింది. ఈ ఫీచర్ భారతదేశంలోని ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంది.

నిమిషం వ్యవధిలోనే..

యూఎస్ జియాలజికల్ సర్వే నివేదిక ప్రకారం.. మొదటి భూకంపం 7.2 తీవ్రతతో కరేబియన్ తీరంలోని మొరాన్ పట్టణానికి పశ్చిమంగా సంభవించింది. ఇది కరాకస్‌కు పశ్చిమంగా 170 కిలోమీటర్ల దూరంలో, భూమికి 22 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. ఈ ఘోరం జరిగిన సరిగ్గా ఒక్క నిమిషం తర్వాత.. అంతకంటే శక్తిమంతమైన 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. దీని కేంద్రం మొరాన్‌కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో, కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండటం వల్ల వినాశనం తీవ్రత మరింత ఎక్కువగా నమోదైందని యూఎస్‌జీఎస్ పేర్కొంది. 

ప్రాణభయంతో జనం పరుగులు.. 

కరాకస్‌‌‌‌‌‌‌‌లోని భారీ భవనాలు పేకమేడల్లా ఊగిపోవడంతో ప్రాణభయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వెనక్కి తిరిగి చూసేసరికి ఇండ్లు, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఫ్లాట్ల గోడలు కూలిపోయి, బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌లలోని ఫర్నిచర్ రోడ్డుపైకి కనిపిస్తుండటంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రాజధానిలోని రెండు అత్యంత రద్దీ ప్రాంతాలలో భవనాలు కూలుతుండటంతో ఆకాశమంత ఎత్తున దుమ్ము, ధూళి మేఘాలు కమ్మేశాయి. 

ఆఫ్టర్ షాక్స్  వచ్చే అవకాశం ఉన్నందున భవనాలు మరింత దెబ్బతినే ప్రమాదముందని, ఎవరూ ఇళ్లలోకి వెళ్లవద్దని అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ప్రజలను హెచ్చరించారు. దీంతో వేలాది మంది రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చుట్టూ దుమ్ము కమ్ముకుంటున్నా.. కొందరు కింద కూర్చుని తమ పెంపుడు జంతువులను హత్తుకుని ఏడుస్తూ కనిపించారు. మరికొందరు రాత్రంతా పార్క్ చేసిన కార్లలో, సబ్‌‌‌‌‌‌‌‌వే స్టేషన్లలో, బహిరంగ ప్రదేశాలలో ఉండిపోయారు.

మరణాలు లక్ష దాకా..

ఈ విపత్తులో మరణాల సంఖ్య 10,000 నుంచి 1,00,000 వరకు ఉండవచ్చని అమెరికా జియాలజికల్ సర్వే(యూఎస్‌‌‌‌‌‌‌‌జీఎస్) శాస్త్రవేత్తలు హెచ్చరించారు. భూకంపాలు సంభవించిన కొద్దిసేపటికే, యూఎస్‌‌‌‌‌‌‌‌జీఎస్‌‌‌‌‌‌‌‌కు చెందిన ‘ప్రాంప్ట్ అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ గ్లోబల్ ఎర్త్‌‌‌‌‌‌‌‌క్వేక్ రెస్పాన్స్(పేజర్)’ వ్యవస్థ.. తుది మరణాల సంఖ్య 10,000 నుంచి లక్ష వరకు ఉండవచ్చని అంచనా వేసింది. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పేజర్ వ్యవస్థ భూకంప తీవ్రత, లోతు, స్థానం, జనాభా సాంద్రత, చారిత్రక భూకంపాల డేటా, భవనాల బలహీనతలను వేగంగా విశ్లేషించి దాని ప్రభావాలను అంచనా వేస్తుంది. చాలా సందర్భాలలో, పేజర్ అంచనా వేసిన సంఖ్య వాస్తవ మరణాల సంఖ్యకు చాలా దగ్గరగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

అండగా ప్రపంచ దేశాలు..

ఈ విపత్కర పరిస్థితుల్లో వెనెజువెలాకు ప్రపంచవ్యాప్తంగా సహాయం వెల్లువెత్తుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణ సహాయాన్ని ప్రకటించారు. ‘‘వెనెజువెలా ప్రజలను వణికించిన రెండు భారీ భూకంపాలు భారీ సంఖ్యలో మరణాలను మిగిల్చాయి. సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది. వేగంగా రంగంలోకి దిగడానికి సిద్ధం కావాలని మా ప్రభుత్వంలోని అన్ని సంస్థలను ఆదేశించా” అని ఆయన పేర్కొన్నారు. 

అమెరికా చేస్తున్న సాయానికి గాను ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌‌‌‌‌‌‌‌కు రోడ్రిగెజ్ కృతజ్ఞతలు తెలిపారు. వెనెజువెలాకు సహాయం అందిస్తున్న వివిధ దేశాల అధినేతలకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈక్వెడార్ నుంచి ఇప్పటికే మానవతా సహాయం అందిందని.. ఖతార్, మెక్సికో, ఎల్ సాల్వడార్ దేశాల నుంచి రెస్క్యూ సిబ్బంది వెనెజువెలాకు చేరుకున్నారని రోడ్రిగెజ్ వివరించారు. 

ఒక్కరోజే 5 దేశాల్లో భూకంపాలు.. యాదృచ్ఛికమే..!

జకార్తా: ప్రపంచవ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం మధ్య..  కేవలం12 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే మూడు వేర్వేరు ప్రాంతాలైన ఉత్తర కాలిఫోర్నియా, వెనెజువెలా, జపాన్‌‌‌‌‌‌‌‌లను వరుసగా భారీ భూకంపాలు వణికించాయి. ఇండియా, నేపాల్‌‌‌‌‌‌‌‌లోనూ స్వల్ప భూకంపాలు నమోదయ్యాయి. ప్రపంచ భూగర్భ పలకల్లో ఈ హఠాత్ అలజడి చోటుచేసుకోవడం గమనార్హం.

 అయితే, ఈ భూకంపాల మూలాలు ఒకదానికొకటి సంబంధం లేనివని, భౌగోళికంగా దూరంగా ఉన్నాయని ఇండోనేసియా విపత్తు నిపుణుల సంఘం(ఐఏబీఐ) సభ్యుడు దార్యోనో స్పష్టం చేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవించే కేంద్రాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవి ఒకే సమయంలో లేదా కొద్దిపాటి వ్యవధిలో సంభవించినప్పుడు అది కాకతాళీయమే అవుతుంది. ఒక భూకంపం వల్ల మరో ప్రాంతంలో భూకంపం ప్రేరేపితం కావడం కానీ, ఒకదాని ప్రభావం ఇంకోదానికి వ్యాపించడం కానీ జరగదు” అని ఆయన చెప్పారు. 

ఉత్తర కాలిఫోర్నియా, వెనెజువెలాలో భూమికి తక్కువ లోతులో ఉన్న స్థానిక ఫాల్ట్ లైన్ల (పగుళ్లు) వల్ల ప్రకంపనలు రాగా.. జపాన్‌‌‌‌‌‌‌‌లో సబ్‌‌‌‌‌‌‌‌డక్షన్ జోన్ (భూగర్భ పలకలు ఒకదాని కిందకు మరొకటి నెట్టబడే ప్రాంతం) కదలికల వల్ల భూకంపం వచ్చిందన్నారు. ఈ విధంగా భిన్నమైన భౌగోళిక కారణాల వల్లనే ఈ వరుస విపత్తులు సంభవించాయని ఆయన వివరించారు.

ఏ సాయానికైనా భారత్ సిద్ధం: మోదీ

న్యూఢిల్లీ: వెనెజువెలాలో భూకంపాల వల్ల జరిగిన విధ్వంసంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దేశానికి సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. ‘‘వెనెజువెలాలో సంభవించిన తీవ్రమైన భూకంపాల వల్ల జరిగిన విధ్వంసం నన్ను తీవ్రంగా కలచివేసింది. భారత ప్రజల తరఫున వెనెజువెలా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు, ముఖ్యంగా తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భారత్ ప్రార్థిస్తోందని, ఈ కష్టసమయంలో బాధితులందరికీ అండగా నిలుస్తుందని తెలిపారు. 

చరిత్రలోనే అత్యంత  భారీ భూకంపాలు ఇవే..

 

  • వాల్దివియా (చిలీ), 1960: ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైనదిగా రికార్డైన ఈ భూకంపం మే 22న దక్షిణ చిలీని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 9.5గా నమోదైంది. 1,655 మంది చనిపోగా, 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

  • ప్రిన్స్ విలియం సౌండ్ (అలాస్కా), 1964: ఉత్తర అమెరికా చరిత్రలోనే అతిపెద్దది, ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన ఈ భూకంపం మార్చి 27న సంభవించింది. 9.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వల్ల అలాస్కా, ఒరెగాన్, కాలిఫోర్నియా ప్రాంతాల్లో మొత్తం 131 మంది ప్రాణాలు కోల్పోయారు.
     
  • సుమత్రా (ఇండోనేసియా), 2004: డిసెంబర్ 26న ఇండోనేషియాలోని సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం సృష్టించిన సునామీ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఘోర విపత్తులో ఏకంగా 2,30,000 మంది మరణించారు.
  • తోహోకు (జపాన్), 2011: మార్చి 11న ఈశాన్య జపాన్​లో 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీనివల్ల 130 అడుగుల ఎత్తున ఎగిసిపడిన సునామీ కెరటాలు ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రాన్ని ముంచెత్తాయి. ఈ ఘటనలో 18,000 మందికి పైగా మరణించారు. 
  • మౌలే (చిలీ), 2010: ఫిబ్రవరి 27న మధ్య చిలీలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనివల్ల వచ్చిన సునామీ 2,000 కి.మీ. తీరప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఈ విపత్తుల కారణంగా 526 మంది చనిపోగా, 18 లక్షల మంది ప్రభావితమయ్యారు.
  • టర్కీ-సిరియా, 2023: ఫిబ్రవరి 6న టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో 7.8 తీవ్రతతో పెను భూకంపం వచ్చింది. ఆ తర్వాత 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో రెండు దేశాల్లో కలిపి 59,000 మందికి పైగా మరణించారు.
  • నేపాల్, 2015: ఏప్రిల్ 25న ఖాట్మండుకు 
  • వాయవ్యంగా ఉన్న గూర్ఖా కేంద్రంగా 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో దాదాపు 9,000 మంది చనిపోగా, 22,000 మందికి పైగా గాయపడ్డారు.