
- అబూజ్మడ్ అడవుల్లో 72 గంటలపాటు కొనసాగిన ఆపరేషన్
- మావోయిస్ట్ పొలిట్ బ్యూరోమీటింగ్పై బలగాల మెరుపుదాడి
- కేశవరావు సహా 27 మంది నక్సల్స్ చనిపోయినట్లు అమిత్ షా ట్వీట్
- వచ్చే ఏడాది మార్చి 31 వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటన
- ఎన్కౌంటర్లో ఓ జవాన్ కూడా మృతి
- మావోయిస్ట్ చీఫ్ కమాండర్గాఉన్న నంబాల కేశవరావు
- 2018లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
- శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేటలో జననం..వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ పూర్తి
- ఎంటెక్ మధ్యలో ఆపేసి నక్సలిజం వైపు పయనం
- చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక పాత్ర
- గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో నేర్పరి
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ కగార్’తో వరుసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో కొన్నిరోజులుగా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు సహా మావోయిస్టు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. 2003లో చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడితో పాటు అనేక ఘటనల్లో కేశవరావు వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన వయసు 70 ఏండ్లు. కోటిన్నర రూపాయల రివార్డు కూడా ఉంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మెరుపుదాడి
ఆపరేషన్ కగార్తోపాటు కర్రెగుట్టలపై భద్రతా బలగా ల కూంబింగ్తదితర పరిణామాలపై మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్, -నారాయణ్‌పూర్ జిల్లాల బార్డర్‌లోని ఇంద్రావతి దండకారణ్యంలో జరుగుతున్నట్లుగా ఇంటిలి జెన్స్ వర్గాల ద్వారా కేంద్ర బలగాలు పసిగట్టాయి. దీంతో బస్తర్ ఐజీ సుందర్ రాజ్. పి అలర్ట్ అయ్యారు.
బీజాపూర్, దంతెవాడ జిల్లాల నుంచి డీఆర్జీ బలగాలను నారాయణ్‌పూర్ జిల్లా డీఆర్జీ బలగాలకు తోడుగా కూంబింగ్ కోసం పంపించారు. మూడురోజులుగా బలగాలు ఇంద్రావతి దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇదే సమయంలో నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాట్లూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాన్ని గుర్తిం చిన భద్రతా బలగాలు ఒక్కసారిగా మెరుపుదాడికి దిగా యి. బుధవారం ఉదయం భారీగా కాల్పుల మోతలు వినిపించాయి. ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు.
అక్కడ మావోయిస్టు పార్టీ చీఫ్ కమాండర్, కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో అదనపు బలగాలను ఓర్చా పోలీస్‌స్టేషన్ ప్రాంతానికి తరలించారు. మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలు తరలించే సమయంలో మావోయిస్టులు దాడికి దిగొచ్చన్న అనుమానంతో బ్యాకప్ టీంలు రౌండప్ చేసి అడవిలో కూంబింగ్ చేపట్టాయి. కాగా, బలగాలు సాహసోపేతంగా పోరాటం చేశాయని చత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి అన్నారు. 72 గంటల పాటు బలగాలు కూంబింగ్ చేశాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్‌శర్మ తెలిపారు.
మార్చి 31 వరకు నక్సలిజం అంతం: అమిత్ షా
దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి 31లోపు పూర్తిగా అంతమొందించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ సంకల్పం తీసుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మృతి చెందిన విషయాన్ని ధ్రువీకరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయమని పేర్కొన్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ముగిసేనాటికి చత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో 54 మంది మావోయిస్టులు అరెస్టయ్యారని, 84 మంది లొంగిపోయారని అమిత్ షా తెలిపారు.
ప్రజలకు శాంతిని అందిస్తం: ప్రధాని మోదీ
మావోయిజాన్ని నిర్మూలిస్తామని, ప్రజలకు శాంతిని అందిస్తామని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. ‘‘బలగాల అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్న. ప్రజలకు శాంతిని, అభివృద్ధిని అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని పోస్ట్ చేశారు.
ఇది కీలక విజయం: అమిత్ షా
నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ‘‘చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్‌లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో సీపీఐ–మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ, టాప్ మోస్ట్ లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజాన్ని నిర్మూలించే ప్రక్రియలో ఇది ఓ మైలురాయి విజయం. నక్సలిజంపై మూడు దశాబ్దాలుగా భారత్ చేపడ్తున్న పోరాటంలో ఒక జనరల్ సెక్రటరీ స్థాయి లీడర్ చనిపోవడం ఇదే మొదటిసారి” అని ఆయన పేర్కొన్నారు.
సజ్జా వెంకట నాగేశ్వరరావు కూడా..?
చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో సజ్జా వెంకట నాగేశ్వరరావు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈయన మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రెస్ యూనిట్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీ పత్రికలో ఎడిటోరియల్ ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. రాజన్న అలియాస్ ఏసన్న అలియాస్ నవీన్ పేర్లతో ఆయనను పిలుస్తుంటారు. నాగేశ్వరరావు స్వగ్రామం ఏపీలోని చీరాల మండలం జాండ్రపేట.
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందడంతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర హోంశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రతీకారేచ్ఛతో మావోయిస్టులు దాడులకు పాల్పడే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. మావోయిస్టుల కదలికపై దృష్టిసారించాలని ఆయా రాష్ట్రాల పోలీసులకు సూచించింది.