వర్ధన్నపేట (ఐనవోలు)వెలుగు : ఐనవోలు జాతర ఉత్సవాలకు ముందు మల్లికార్జునస్వామికి నిర్వహించే దృష్టి కుంభాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వచ్చే ఏడాది జాతర సందర్భంగా స్వామికి ఆరురోజులు సాగిన సుధావలి వర్ణలేపనం సోమవారం పూర్తైంది. దృష్టి దోషాలు జరగకుండా.. స్వామి, అమ్మవార్లకు రంగులు అద్ది నేత్రోన్మీలన(నేత్రాలకు మైనం)పెట్టారు.
గర్భగుడికి ఎదురుగా అర్ధ మండపంలో రెండు క్వింటాలు అన్నం వండి రాశిగా పోసి కుంకుమ హారతులు వెలిగించారు. అన్నం రాశికి ఎదురుగా అద్దాన్ని రాశికి అవతల తూర్పు వైపు మేకపిల్లను నిలిపారు. స్వామి, అమ్మవార్ల దృష్టి నేరుగా అన్నం రాశి, మేక పిల్లపై పడేవిధంగా చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యహవాచనం చేసి సంప్రోక్షణ జరిపారు.
దీంతో 6 రోజుల పాటు నిలిచిన ఆర్జిత సేవలు యథావిధిగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కందుల సుధాకర్ , చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ , ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్ శర్మ, నందనం మధు శర్మ, ధర్మకర్తలు గడ్డం రేణుక, మహేందర్ పాల్గొన్నారు.
