- 14 మంది కార్మికులు మృతి.. 60 మందికి గాయాలు
సోల్: దక్షిణ కొరియాలోని డేజియన్ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్ల విడిభాగాల తయారీ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో14 మంది మృతి చెందగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. డేజియన్నగరంలోని అంజున్ ఇండస్ట్రియల్ సంస్థ హ్యుందాయ్, కియా వంటి ప్రముఖ కార్ల కంపెనీలకు ఇంజిన్ వాల్వులను సరఫరా చేస్తుంది. ఆ ఫ్యాక్టరీలో మూడు అంతస్తుల భవనంలో 170 మంది కార్మికులు పనిచేస్తుంటారు. శుక్రవారం మధ్యాహ్నం ఫ్యాక్టరీలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. వెంటనే మంటలు చెలరేగడంతో ప్రాణభయంతో చాలామంది కార్మికులు మొదటి అంతస్తులోని కిటికీల నుంచి కిందకు దూకారు.
విషయం తెలుసుకున్న ఫైర్‌సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, దాదాపు 60 మంది గాయపడ్డారు. తొమ్మిది మంది మృతదేహాలు భవనంలోని మూడో అంతస్తులో ఉన్న జిమ్ లాకర్ రూమ్‌లో లభ్యమయ్యాయి. మంటల తీవ్రతకు కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో డీఎన్‌ఏ (DNA) పరీక్షలు చేశారు. కాగా, ఈ ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ స్పందిస్తూ దేశంలో కార్మికుల భద్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.
