హైదరాబాద్: మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. షేర్స్ బజార్, కిసాన్ పరివార్ సంస్థలపై బాధితులు తీవ్ర ఆరోపణలు చేశారు. అధిక లాభాల పేరుతో తెలుగు రాష్ట్రాల్లో వందల మందిని మోసం చేసినట్లు ఈ సంస్థలపై ఆరోపణలు రావడం గమనార్హం.
దేశవ్యాప్తంగా వేలాది మంది నుంచి వందల కోట్ల రూపాయలు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌ను బాధితులు ఆశ్రయించారు. మహబూబాబాద్ జిల్లా కందికొండ గ్రామానికి చెందిన భూపాల్ను ఈ మొత్తం వ్యవహారంలో కీలక వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
►ALSO READ మహబూబ్‌నగర్‌లో వడగళ్ల వాన బీభత్సం.. కారుపై గోడ కూలి ఇద్దరు స్పాట్ డెడ్
కొండాపూర్‌లో షేర్స్ బజార్ సంస్థను భూపాల్ ప్రారంభించాడు. సెబీ రిజిస్ట్రేషన్ ఉందంటూ పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లక్ష రూపాయల పెట్టుబడికి నెలకు 4 శాతం రాబడి ఇస్తామని హామీ ఇచ్చారు. 150 మందికి పైగా ఉద్యోగులతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ ప్రచారంతో పెట్టుబడిదారులను సదరు సంస్థ ఆకర్షించింది. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన బాధితులు ఇదంతా పెద్ద స్కాం అని.. తాము మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు.
