హైదరాబాద్ సిటీ, వెలుగు: దోమల నివారణ పేరుతో గ్రేటర్లో భారీగా నిధుల దుర్వినియోగం జరుగుతోంది. గతంలో జరిగిన అక్రమ డీజిల్ విక్రయాలను కప్పిపుచ్చడానికి, ఇప్పుడు ఫాగింగ్ పని తప్పించుకోవడానికే వేల లీటర్ల డీజిల్ నేల పాలు చేస్తున్నారు. ఎంటమాలజీ విభాగంలో జరుగుతున్న ఈ అక్రమాల బాగోతాన్ని సొంత సిబ్బందే తట్టుకోలేకపోతున్నారు.
బల్దియా దోమల నివారణ విభాగంలో పని చేయడానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అక్రమాలు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయన్న భయంతో నేరుగా సీఎం ప్రజావాణి ద్వారా బదిలీ కోరుతున్నారు. ఇప్పటికే మల్కాజిగిరి సర్కిల్లోని ఇద్దరు వర్కర్లు తమను వెంటనే బదిలీ చేయాలని సీఎం ప్రజావాణికి ఫిర్యాదు చేశారు.
నాలుగు నెలలుగా కొత్త విధానం
జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగంలో దోమల నివారణ కోసం కేటాయిస్తున్న డీజిల్, పెట్రోల్‌ను అక్రమంగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో కమిషనర్ కర్ణన్ గత నాలుగు నెలలుగా కొత్త విధానం అమలు చేస్తున్నారు. దోమల నివారణకు వాడే మాలతీయాన్ కెమికల్‌ను ఫిల్లింగ్ స్టేషన్ వద్దే డీజిల్‌లో మిక్స్ చేసి ఇస్తున్నారు.
ఇదివరకు డీజిల్, మాలతీయాన్ వేర్వేరుగా ఇవ్వడంతో అందులోంచి డీజిల్‌ను సపరేట్ గా విక్రయించేందుకు అక్రమార్కులకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఒక వేళ ఆ డీజిల్‌ను వాహనాల్లో పోస్తే ఇంజిన్ పాడవుతుందని, ఫాగింగ్ చేయకుండానే ఎక్కడ పడితే అక్కడ పారవేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సీఎం ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులోనూ ఓ వర్కర్ ఇదే ప్రస్తావించారు.
గతంలో అక్రమ విక్రయాలు.. ఇప్పుడు నేలపాలు
ఒక్కో డివిజన్‌కు రెండు ఫాగింగ్ మెషిన్లు ఉంటే.. ప్రతి మెషిన్‌కు రోజూ 7 లీటర్ల డీజిల్, ఒక లీటర్ పెట్రోల్‌ను బల్దియా అందిస్తుంది. నిజానికి 5 లీటర్ల డీజిల్ మాత్రమే అవసరం ఉండగా, మిగిలినది ప్రతిరోజూ వృథా అవుతోందని మల్కాజిగిరి సర్కిల్లో పనిచేస్తున్న ఓ వర్కర్ స్వయంగా సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.
ఇలా ఒక్క సర్కిల్లో డైలీ దాదాపు 50 లీటర్ల డీజిల్ వృథా అవుతుండగా, మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ నష్టం ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. “నేను రెండు డివిజన్లలో పనిచేశా.. ఎక్కడా 5 లీటర్లకు మించి డీజిల్ అవసరం లేదు. మిగిలినది ఒత్తిడితో నేల పారబోస్తున్నాం. ఇలా చేయడం నా వల్ల కాకే ఫిర్యాదు చేశా” అని తెలిపాడు.
ఇక పెట్రోల్‌ను సిబ్బంది తమ వాహనాల్లోనే వేసుకుంటున్నారన్నారు. గతంలో జరిగిన అక్రమ డీజిల్ విక్రయాలను కప్పిపుచ్చడానికి, ఇప్పుడు ఫాగింగ్ పని తప్పించుకోవడానికే ఈ విధంగా డీజిల్‌ను నేల పాలు చేస్తున్నారని చెప్పారు. ఉన్నతాధికారులు దీనిపై పట్టించుకోవడం లేదని ఆ వర్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఒక్క సర్కిల్లోనే 50 లీటర్ల డీజిల్ వృథా
జీహెచ్ఎంసీ ఆరు జోన్లలోని 30 సర్కిళ్లలో దోమల నివారణకు 300 చిన్న ఫాగింగ్ మెషిన్లు, 63 పెద్ద మెషిన్లు ఉండగా.. ప్రతి డివిజన్‌కు రెండు చిన్న మెషిన్లు, ప్రతి సర్కిల్‌కు రెండు పెద్ద మెషిన్లతో ఫాగింగ్ చేయాల్సి ఉంది. దాదాపు 50 మెషిన్లు ఎప్పుడూ రిపేర్‌లోనే ఉంటున్నాయని, రిపేర్లు చేయకుండానే సీనియర్ ఎంటమాలజీస్టులు ఫేక్ బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారని సొంత సిబ్బందే ఆరోపిస్తున్నారు.
గ్రేటర్‌లోని 4,850 కాలనీల్లో ఎప్పటికప్పుడు దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా గ్రౌండ్లో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. 2020–-21లో దోమల నివారణకు బల్దియా రూ.25 కోట్లు ఖర్చు చేయగా, 2021–22 లో రూ.25 కోట్లకుపైగా, 2022–23లో దాదాపు రూ.30 కోట్ల ఖర్చు దాటింది. గతేడాది రూ.32 కోట్లు ఖర్చు చేయగా, ఈసారి రూ.30 కోట్ల దాటే అవకాశం అయినప్పటికీ దోమలు మాత్రం తగ్గడం లేదు.
