ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 490 సర్పంచ్ స్థానాలు ‘ఆమె’కే..రిజర్వేషన్లలో మహిళలకు పెద్దపీట

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 490 సర్పంచ్ స్థానాలు ‘ఆమె’కే..రిజర్వేషన్లలో మహిళలకు పెద్దపీట
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  1,042 గ్రామ పంచాయతీలు
  • మహిళా అభ్యర్థులపై పార్టీల ఫోకస్ 
  • కుటుంబ సభ్యులను బరిలో  నిలిపేందుకు కొందరు ప్లాన్​ 

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:  పంచాయతీ రిజర్వేషన్లలో మహిళలకు పెద్దపీట వేశారు. ఖమ్మం జిల్లాలో 571 జీపీలకు గానూ 260 సర్పంచ్​ స్థానాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 471 జీపీలకు గానూ 230 సర్పంచ్ స్థానాలు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. వీటితోపాటు జనరల్ స్థానాల్లోనూ వారు పెద్ద ఎత్తున పోటీ చేసే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో 5,214 వార్డులకు గానూ 2,252 వార్డులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4,168 వార్డులకు గానూ 1,885 వార్డులను మహిళలకే కేటాయించారు. రెండు జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో మహిళా అభ్యర్థులపై పొలిటికల్ పార్టీలు ఫోకస్ పెట్టాయి.  

కేటగిరీల వారీగా..

ఖమ్మం జిల్లాలోని సర్పంచ్​స్థానాల్లో 76 ఎస్టీ(మహిళ), 48 ఎస్సీ(మహిళ), 24 బీసీ(మహిళ), 112 జనరల్​(మహిళ)కు రిజర్వ్ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సర్పంచ్ స్థానాల్లో 226 స్థానాల్లో ఎస్టీ(మహిళ), 4 స్థానాలు జనరల్​కు కేటాయించారు. ఖమ్మం జిల్లాలోని వార్డు స్థానాల్లో 515 ఎస్టీ(మహిళ), 376 ఎస్సీ(మహిళ), 263 బీసీ(మహిళ), 1.098 జనరల్​(మహిళ)కు రిజర్వ్​చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వార్డుల్లో 1,420 ఎస్టీ(జనరల్), 13 ఎస్సీ(జనరల్),10 (బీసీ జనరల్), 840(అన్​రిజర్వ్​డ్)గా కేటాయించారు. ఏ మండలంలో లేని విధంగా ఇల్లెందులో 29 గ్రామ పంచాయతీలకు గానూ 15 ఎస్టీ మహిళలకు, 14 ఎస్టీ జనరల్​గా  రిజర్వ్ అయ్యాయి.  

నాన్ షెడ్యూల్డ్​ ఏరియాలో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15 గ్రామ పంచాయతీలు నాన్ షెడ్యూల్డ్​ ఏరియాలో ఉన్నాయి. వీటిలో రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు అశ్వాపురం, బూర్గంపహాడ్ మండలాల్లోని  గ్రామ పంచాయతీల్లో ఒక్కో స్థానాన్ని ఎస్సీ జనరల్​గా రిజర్వ్ చేశారు. అశ్వాపురం, అశ్వారావుపేట, బూర్గంపహాడ్, దమ్మపేట మండలాల్లో 9 స్థానాలను అన్ రిజర్వ్​డ్​గా కేటాయించారు. దీంతో బీసీలు కూడా జనరల్ కేటగిరీలో పోటీ పడే అవకాశం ఉంటుంది.

భద్రాచలం స్పెషల్..

భద్రాచలం మండలంలో ఒక్కటే గ్రామ పంచాయతీ ఉంది. ఆ ఒక్కటీ ఎస్టీ జనరల్ గా రిజర్వ్ అయింది.

ఓటర్ల వివరాలు..

ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో మొత్తం ఓటర్లు 8,02,691 మంది కాగా.. వీరిలో 3,88,243 మంది పురుషులు, 4,14,425 మంది మహిళలున్నారు. థర్డ్​జెండర్​ ఓటర్లు 22 మంది. పురుషుల కంటే 26,182 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6,69,048 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 3,25,045 మంది, మహిళలు 3,43,979 మంది, ఇతరులు 24 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే 18,934 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. జనరల్​స్థానాల్లోనూ మహిళా అభ్యర్థులను బరిలోకి దించేందుకు రాజకీయ పార్టీల నేతలు ప్లాన్ చేస్తున్నారు. పంచాయతీ స్థాయి లీడర్లతో అప్పుడే మంతనాలు సాగిస్తున్నారు. మరోవైపు కొందరు లీడర్లు తమ కుటుంబసభ్యుల్లో మహిళలను పోటీలో నిలపాలని చూస్తున్నారు.