తిరుమలలో అగరబత్తుల పేరుతో ఈ-కామర్స్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నాయా..? టీటీడీ పేరును, తిరుమల పవిత్రతను ఉపయోగించి ఆన్లైన్లో విక్రయాలు జరుపుతున్న వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కాంబో ప్యాకేజీల పేరుతో అగరబత్తులు విక్రయిస్తూ, వాటితో పాటు తిరుమల తీర్థం, శ్రీవారి చిత్రపటాలు, ప్రసాదాలను అందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్న ఈ-కామర్స్ సంస్థలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్లో అంగడి సరుకులుగా తిరుమల ప్రొడక్ట్స్
టిటిడి ఉత్పత్తులు, వాటిని పోలిన నకిలీ ఉత్పత్తులు ఆన్లైన్లో అంగడి సరుకులుగా మారిపోతున్నాయి. భక్తుల ఆదరణకు అనుగుణంగా టిటిడి శ్రీవారి 7 కొండలకు గుర్తుగా 7 రకాల అగరబత్తులను తయారు చేయించి విక్రయిస్తోంది. కొందరు అక్రమార్కులు వాటిని ఈ-కామర్స్ సైట్లలో ఉంచి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. అగరబత్తులతోపాటు ఓ చిన్నపాటి వస్తువును ఉంచి భారీ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. టిటిడి అగరబత్తి కాంబో ప్యాక్ ధర టిటిడి విక్రయించేది రూ. 452.38 కాగా, ఆన్లైన్లో రూ. 1035 నుంచి రూ. 1049 వరకు అమ్ముతున్నారు.
తిరుమల పూలతో అగరబత్తుల తయారీ:
టిటిడి ఆధ్వర్యంలోని ఆలయాల్లో స్వామివారి అలంకరణకు వినియోగించిన పుష్పాలతో అగరబత్తులను తయారు చేస్తుంటారు. తిరుమలతోపాటు తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని రాములవారి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, కపిలేశ్వర ఆలయం, శ్రీనివాసమంగాపురం, అప్పలాయగుంట, నారాయణవనంలోని టిటిడి ప్రముఖ ఆలయాల వద్ద వాటిని విక్రయిస్తుంటారు. టిటిడి అధికారిక వెబ్సైట్ కలిపి నెలకు రూ. కోటివరకు విక్రయాలు జరుగుతున్నాయి.
టిటిడి అనుమతి లేకుండానే ఆన్లైన్లో అమ్మకాలు:
టిటిడి గతంలో కొన్ని ఈ-కామర్స్ సంస్థలకు క్యాలెండర్లు, డైరీల విక్రయానికి అనుమతులు ఇచ్చినా అగరబత్తులను మాత్రం అన్ లైన్ విక్రయాలకు ఇవ్వలేదు. ప్రస్తుతం టిటిడి అనుమతి లేకుండానే కొన్ని సంస్థలు భారీ స్థాయిలో అగరబత్తులను విక్రయించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. టిటిడి లేబుళ్లను వినియోగించడం కూడా నేరమే.
నిబంధనలకు విరుద్ధంగా అగరబత్తులను సరఫరా చేసేవారిపైన విచారణ జరిపించాలని భక్తులు కోరుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి గతంలో లేబుళ్లు సిద్ధం చేసి విక్రయిస్తుండగా విజిలెన్స్‌కు ఫిర్యాదు టిటిడి ఫిర్యాదు చేసింది. లేబుళ్ల దుర్వినియోగం, ఆన్లైన్లో విక్రయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని టిటిడి అధికారులు చెబుతున్నారు.
కఠిన చర్యలకు టిటిడి సిద్ధం..!
టిటిడి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అగరబత్తీలను తయారు చేసి భక్తులకు విక్రయిస్తోంది. టీటీడీ అనుమతి లేకుండానే శ్రీవారి పేరు, తిరుమల పవిత్రతను ఉపయోగించి విక్రయాలు జరపడం సరైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పవిత్ర క్షేత్రానికి సంబంధించిన అంశాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుమల పేరును వాడుతున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భక్తులు కూడా అధికారికంగా టీటీడీ విడుదల చేసే ప్రసాదాలు, తీర్థం, ఇతర పవిత్ర వస్తువులను మాత్రమే విశ్వసించాలని, ఆన్లైన్లో వస్తున్న అనధికారిక ప్రచారాలను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
