బాలల చిత్రాలతో పలు అవార్డులు పొందిన దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ తమ ప్రొడక్షన్‌లో ఆరవ చిత్రంగా ‘మాస్టర్ సంకల్ప్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ ‘పిల్లలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. బాలల కోసం నిస్వార్థంగా సినిమాలు రూపొందిస్తున్న సుధాకర్ గౌడ్ అభినందనీయులు. ట్రైలర్ చాలా బాగుంది.
పిల్లల్లో మానసిక రుగ్మతలను ఎలా పోగొట్టాలి అనే అంశాన్ని ఎంతో ఆసక్తికరంగా చూపిస్తున్నారు’ అని అన్నాడు. దర్శక నిర్మాత సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ‘పిల్లలు శారీరకంగానే కాదు మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సందేశాన్నిస్తూ ఈ సినిమాను రూపొందించాను. త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నాం’ అని అన్నారు. శ్రీ మిత్ర చౌదరి, పెంచల్ రెడ్డి పాల్గొన్నారు.
