Match Fixing: పాకిస్థాన్ క్రికెట్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. పాక్ స్టార్ క్రికెటర్లు మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్లకు పాకిస్థాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NCCIA) అత్యవసర సమన్లు జారీ చేసింది. విచారణకు నేరుగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ పరిణామం వెనుక మ్యాచ్ ఫిక్సింగ్, అనుమానాస్పద సంభాషణల కోణం ఉందనే వార్తలు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ప్లేయర్ల ఫోన్లను సీజ్ చేసిన పీసీబీ:
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మధ్యలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌లతో పాటు మరొక సీనియర్ ప్లేయర్ మొబైల్ ఫోన్లను తమ స్వాధీనంలోకి తీసుకుంది. అనంతరం ఆ ఫోన్లను విచారణాధికారులకు అప్పగించింది. ఆ ఫోన్ల నుంచి సైబర్ క్రైమ్ ఏజెన్సీ కీలక డేటాను రీస్టోర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం ఆధారంగానే ఇప్పుడు ఈ ఇద్దరినీ విచారణకు పిలిచినట్లు తెలుస్తుంది.
అసలు ఫోన్లు ఎందుకు గుంజుకున్నారు?:
పాకిస్తాన్ ఆటగాళ్ల ఫోన్లను బోర్డు ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది? వారి నుంచి అధికారులు ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు? అనే విషయాలపై పీసీబీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ రహస్య తీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్‌కు మ్యాచ్ ఫిక్సింగ్‌లు, బెట్టింగ్ రాయబారులతో సంబంధాలు ఉండటం కొత్తేమీ కాదు. దీంతో ఈసారి కూడా ఏమైనా బుకీల నుంచి బెట్టింగ్ సంభాషణలు జరిగాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
లార్డ్స్ టెస్టు ఓటమి తర్వాత ఊచకోత:
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పాకిస్థాన్ దారుణంగా ఓడిపోయింది. ముఖ్యంగా లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత పీసీబీ జట్టులో విప్లవాత్మక మార్పులు చేసింది. రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌లతో సహా ఏడుగురు ప్లేయర్లు, ఇద్దరు కోచ్‌లను టెస్ట్ సెటప్ నుంచి ఒకేసారి తొలగించింది. జట్టు నుంచి తొలగించడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా సైబర్ క్రైమ్ విచారణ ఎదుర్కొంటుండటంతో పాక్ క్రికెట్లో ఏం జరుగుతోందో తెలియక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.
NCCIA has summoned Imam-ul-Haq & Mohammad Rizwan over information found on their phones. (Geo News) pic.twitter.com/nnps9aAEKY
— Sheri. (@CallMeSheri1_) September 10, 2026
