IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బౌలర్ ఔట్

IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బౌలర్ ఔట్

ఐపీఎల్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. శ్రీలంక స్టార్ పేసర్ మతీషా పతిరనా గాయంతో ప్రారంభ మ్యాచ్ లకు దూరంగా కానున్నాడు. 21 ఏళ్ళ ఈ లంక బౌలర్ స్నాయువు గాయంతో బాధపడుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పతిరానా కనీసం నాలుగు నుండి ఐదు వారాల పాటు ఆటకు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టీ20లో పతిరానా గాయపడ్డాడు. 

పతిరానా దూరం కావడం చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఎదురు దెబ్బ తగలనుంది. 2023 సీజన్ లో ఈ శ్రీలంక స్పీడ్ స్టార్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ సీజన్ లో మొత్తం 12 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టి చెన్నై టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. “అతను ఎప్పుడు అందుబాటులో ఉంటాడో తెలుసుకోవడానికి మేము SLCతో మాట్లాడాలి. అతను మా ప్రధాన బౌలర్లలో ఒకడు" అని CSK సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 

పతిరానా లేకపోయినా చెన్నై స్క్వాడ్ లో అనుభవమున్న బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజర్ రెహమాన్ కు అతని స్థానంలో తుది జట్టులో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఐపీఎల్ 2024 వేలంలో ఈ బంగ్లాదేశ్ పేసర్‌ను చెన్నై రూ. 2 కోట్లకు ధరకు దక్కించుకుంది. గతంలో ఈ బంగ్లా బౌలర్ సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడాడు. మార్చి 20న ముస్తాఫిజార్ చెన్నై శిబిరంలో చేరతాడు. ఇప్పటికే గాయంతో ఓపెనర్ కాన్వే టోర్నీ ప్రథమార్ధానికి దూరమైన సంగతి తెలిసిందే.