IND vs ENG 2025: కోహ్లీ స్థానంలో అతడే సరైనోడు.. అనుభవానికే ఓటేసిన ఆసీస్ దిగ్గజం

IND vs ENG 2025: కోహ్లీ స్థానంలో అతడే సరైనోడు.. అనుభవానికే ఓటేసిన ఆసీస్ దిగ్గజం

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది. కోహ్లీ టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత దశాబ్ధాకాలంగా కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు కోహ్లీ లేకపోవడంతో అతని స్థానంలో గిల్, కరుణ్ నాయర్, రాహుల్ లలో ఒకరు బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హేడెన్ నాలుగో స్థానంలో అనుభవజ్ఞుడు కేఎల్ రాహుల్ ను ఆడించాలని సలహా ఇచ్చాడు. 

స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ తో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ..  కోహ్లీ గతంలో 4వ స్థానంలో ఉన్న పాత్రలోకి కేఎల్ రాహుల్ భర్తీ చేయాలని సూచించాడు. రాహుల్ నాలుగో స్థానానికి చక్కగా సరిపోతాడని తన అభిప్రాయాన్ని తెలిపాడు. టెస్టుల్లో నాలుగో స్థానం చాలా ముఖ్యమని.. ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి రాహుల్ అర్హుడని ఈ మాజీ ఆసీస్ ఓపెనర్ తెలిపాడు. కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని.. అయితే ఈ కీలకమైన స్థానంలో రాహుల్ ను బ్యాటింగ్ కు పంపాలని హేడెన్ అన్నాడు. 

గణాంకాలను పరిశీలిస్తే రాహుల్ ఓపెనింగ్ కంటే కూడా మిడిల్ ఆర్డర్ లో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఓపెనింగ్ కంటే మిడిల్ ఆర్డర్ లో రాహుల్ రికార్డ్ బలంగా ఉందని ఈ ఆసీస్ మాజీ ఓపెనర్ నొక్కి చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌లో రాహుల్ 4వ స్థానంలో రెండుసార్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 54.00 యావరేజ్ తో 108 పరుగులు చేశాడు. రాహుల్ కు ఇంగ్లాండ్ లో డీసెంట్ రికార్డ్ ఉంది. తొమ్మిది మ్యాచ్‌ల్లో 34.11 యావరేజ్ తో 614 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.

టెస్ట్ సిరీస్ లో భాగంగా లీడ్స్‌లోని హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. 2024 ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి. ఈ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.

ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్

1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్