
ప్రియమైన పెదనాన్నగారికి (తిపిరి తిరుపతి అలియాస్ దేవ్జీ) ముందుగా మీ పాదాలకు నా నమస్కారం. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. మీ పేరు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నాలో తెలియని గర్వంతోపాటు బాధ కూడా కలుగుతుంది. మీ ఆలోచనలు, ధైర్యం, పట్టుదల- ఇవన్నీ నన్ను ఎంతగానో ఆలోచింపచేస్తాయి. మిమ్మల్ని కలవాలని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ ఆ అవకాశం నాకు ఎప్పుడూ దొరకలేదు. మీ గురించి పత్రికలలో వచ్చే వార్తలు చదివినప్పుడల్లా మీరు ఎంత గొప్పవారో అని చాలా గర్వంగా అనిపిస్తుంది. అయితే, ఇటీవల సంఘటనలు చూస్తుంటే ఎంతో ఆందోళన కలుగుతోంది. మీరు ఈ దేశం సమ సమాజ నిర్మాణం కోసం వెళ్లారు.
పెద్దనాన్నా.. మీరు ఎలా ఉన్నారు? మీరు తిరిగి వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనైనా తిరిగి ఇంటికి వచ్చేయండి. మీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు ఉన్నారు. దయచేసి వారిని మరిచిపోవద్దు. మీకు ఉద్యమం పట్ల, ప్రజల పైన ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు. మేమందరం మీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం దేనికి అని అనుకుంటే మీరు ఎంతో గెలిచారు. ఎన్నో చేశారు అనిపిస్తుంది.
నాకు అర్థంకాని విషయం ఏమిటి అంటే...ఎందుకు ఆపరేషన్ కగార్?
కన్నోళ్ళని విడిచి కనుమరుగైపోయారు. పేదోడి కష్టాలు తీరుద్దామని ఊరుని, పేరుని వదిలి వెళ్లారు. ఆనందాలు వదులుకొని, అడవుల బాట పట్టారు.. తప్పేం చేశారని ఆపరేషన్ కగార్? ఉన్నత చదువులు వదిలి, ఉనికి మనిషి అయినందుకా? దౌర్జన్యం చేసే దొరలను దారిలో పెట్టినందుకా? కార్లు, బంగ్లాలు వదిలి కారడవుల్లో ఉంటున్నందుకా? సంతోషాలు వదిలి సాధిస్తాం అని వెళ్లినందుకా? ఏం తెలుసు అని వాళ్ళ గురించి? ఉద్యమాన్ని ఎంచుకోవడానికి కారణం ఈ రాజులు, రాజకీయాలు.!
ఉగ్రవాదుల మీద లేని పగ ఉద్యమకారుల మీద ఎందుకు? ఆపరేషన్ కగార్ పేరిట ఎన్కౌంటర్ అయినవారి ఎన్నో కుటుంబాలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాయి. మన దేశంలోకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర దేశాల నుంచి చొరబడి మన పౌరులను చంపుతున్నవారిపై కన్నా, మన దేశపు బిడ్డలైన మావోయిస్టులపైనే ఎక్కువ ఆపరేషన్లు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. మావోయిస్టులను దారుణంగా చంపి సంబరాలు చేసుకుంటూ స్వీట్స్ పంచుకుంటున్నారు. దాన్ని చూస్తుంటే, అది ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితులు నన్ను చాలా బాధ కలిగిస్తున్నాయి. ఇక వస్తారు, ఇక వస్తారు అని ఇంటి గుమ్మంలో ఇంకా మీకోసం ఎదురుచూస్తున్నాం. మేం ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
-ఇట్లు : - సుమ తిపిరి, కుటుంబ సభ్యులు-