ఎన్ బీటీనగర్ ప్రభుత్వ స్కూల్ లో .. అదనపు తరగతి గదులు నిర్మించాలి

ఎన్ బీటీనగర్ ప్రభుత్వ స్కూల్ లో .. అదనపు తరగతి గదులు నిర్మించాలి

హైదరాబాద్, వెలుగు: బంజారాహిల్స్ పరిధి ఎన్ బీటీనగర్ లో సర్కారు బడికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ను కోరారు. మంగళవారం కలెక్టర్ తో కలిసి ఆమె ఎన్ బీటీనగర్ లోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..  హైస్కూల్ పక్కన ఉన్న ఖాళీ స్థలం కబ్జా కాకుండా అడ్డుకున్నామన్నారు. ప్రభుత్వ భూమిలో స్కూల్ కోసం అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. ఈ నిర్మాణం కోసం ఎంపీ కేశవరావు రూ.2 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. 

నిర్మాణానికి సంబంధించి అంచనాలు తయారు చేయాలని కలెక్టర్ ను ఆమె కోరారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మేయర్, కలెక్టర్ వెంట ఆర్డీవో రవికుమార్, డీఈవో రోహిణి, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.