16 అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం

16 అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో 17 అంశాలకు గాను, 16 అంశాలకు ఆమోదం తెలిపినట్లు మేయర్ వెల్లడించారు. అవుట్‌ సోర్సింగ్, రెగ్యులర్ సిబ్బంది హాజరు పరిశీలనకు మొబైల్ ఆధారిత ఫేషియల్ రికగ్నైజేషన్ బయోమెట్రిక్ అటెండెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్​ను అమలు చేయడానికి, ఈ-–ప్రొక్యూర్‌మెంట్ టెండర్ ఆహ్వానించడానికి ఓకే చెప్పినట్లు తెలిపారు. రూ.5- అన్నపూర్ణ భోజన పథకాన్ని మరో ఐదేండ్లు పొడిగించేందుకు హరేకృష్ణ మూవ్​మెంట్​ఫౌండేషన్​తో ఎంఓయూ చేసుకోవాలని నిర్ణయించామన్నారు.

రూ.20 కోట్లతో బేగంపేట ఆర్వోబీ పనులకు, రూ.6కోట్లతో ఆర్​కేపురం ఆర్ఓబీ పునరుద్ధరణ పనులు, రూ.550కోట్లతో ఎల్బీనగర్​చుట్టుపక్కల నాలుగు జంక్షన్లలో మల్టీ లెవల్ ఫ్లైఓవర్/గ్రేడ్ సెపరేటర్ నిర్మాణాల పరిపాలనా అనుమతులకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముజఫర్ హుస్సేన్, ఫాహద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దత్,  మొహమ్మద్​ఖాదిర్, అర్చన, మొహమ్మద్ నసీర్ఉద్దీన్, గౌస్ ఉద్దీన్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.