కాంగ్రెస్​లోకి కేకే, విజయలక్ష్మి

కాంగ్రెస్​లోకి కేకే, విజయలక్ష్మి
  • తీర్థయాత్రలకు వెళ్లినోళ్లు.. తిరిగి ఇంటికి రావాల్సిందేనన్న ఎంపీ
  • అంతకుముందు ఎర్రవల్లి ఫామ్​హౌస్​​లో కేసీఆర్​తో భేటీ
  • పార్టీ వీడొద్దన్న బీఆర్ఎస్ చీఫ్.. తిరస్కరించిన కేకే
  • రేపు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్న విజయలక్ష్మి, ఐకే రెడ్డి

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరనున్నట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభలో పార్టీ పక్ష నేత కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గురువారం ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం తాను కాంగ్రెస్ లో చేరుతానని విజయలక్ష్మి తెలిపారు. కొన్ని రోజులుగా తండ్రీకూతురు పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో కేశవరావును బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గురువారం ఎర్రవల్లిలోని ఫామ్​హౌజ్​కు పిలిపించుకున్నారు. సుమారు గంటకు పైగా మాట్లాడారు.

బీఆర్ఎస్​లోనే ఉండాలని కేకేను కేసీఆర్ కోరినప్పటికీ.. ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకున్న కేకే.. కూతురుతో కలిసి తన నివాసం వద్ద మీడియాతో చిట్​చాట్ చేశారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడారు. ‘‘నేను పుట్టి.. పెరిగింది.. కాంగ్రెస్​లోనే.. ఆ పార్టీ నాకు సొంతిళ్లు లెక్క. తీర్థయాత్రలకు వెళ్లినవాళ్లు ఎప్పటికైనా ఇంటికి తిరిగి రావాల్సిందే కదా.. నేను కూడా సొంతింటికి వెళ్తున్నాను. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ప్రజా సేవ చేయాలనుకుంటున్నాను. ఆ పార్టీలోనే చనిపోవాలని కోరుకుంటున్నాను.

53 ఏండ్లు కాంగ్రెస్​లో  పని చేశా. పదేండ్లు మాత్రమే బీఆర్ఎస్​లో ఉన్న. తెలంగాణ ఏర్పాటు కోసమే ఆ పార్టీలో చేరా. రాజ్యసభకు మొదటి సారి కాంగ్రెస్ వేసిన రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచాను’’అని కేకే తెలిపారు. 

చేరిక డేట్ ఫిక్స్ కాలేదు : కేకే

తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని కేశవరావు గుర్తు చేశారు. ‘‘శనివారం నేను కాంగ్రెస్​లో చేరడం లేదు. ఏ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకుంటానో త్వరలోనే చెప్తాను. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్​లో చేరుతున్నరు’’అని తెలిపారు. తాను ఇంకా బీఆర్ఎస్​కు రాజీనామా చేయలేదన్నారు. ఫామ్​హౌజ్​లో కేసీఆర్​తో భేటీ అయిన మాట వాస్తవమే అని తెలిపారు. ‘‘పార్టీ అంతర్గత అంశాలపైనే మేము మాట్లాడుకున్నాం. బీఆర్ఎస్​లో మంచి కేడర్ ఉంది. చదువుకున్న పిల్లలు కేడర్​లో ఉన్నరు. వాళ్లకు కేసీఆర్ అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇదే ఆయనకు సూచించాను. కవిత అరెస్ట్ పై కూడా చర్చ జరిగింది’’అని కేకే తెలిపారు.

నేను బీఆర్ఎస్​లోనే ఉంటా : విప్లవ్ కుమార్

బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని కేశవరావు కొడుకు విప్లవ్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీ మార్పు విషయంలో తన తండ్రి కేశవరావు, సోదరి విజయలక్ష్మితో తనకు సంబంధం లేదన్నారు. ‘‘కాంగ్రెస్​లో చేరడమనేది వాళ్ల వ్యక్తిగత నిర్ణయం. నేను బీఆర్ఎస్​లోనే ఉంటాను. కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలనుకుంటున్నాను. పార్టీ మారే ఆలోచనే కూడా నాకు లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటాలు చేస్తా’’అని విప్లవ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. విప్లవ్ కామెంట్లపై కేశవరావు స్పందించారు. ‘‘విప్లవ్ పొలిటికల్ కెరీర్ గురించి నేనేం మాట్లాడను. అది అతని ఇష్టం. విప్లవ్ అభిప్రాయాన్ని నేను తండ్రిగా గౌరవిస్తాను’’అని చెప్పారు.

అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతయ్: విజయలక్ష్మి

రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్​లో చేరుతున్నట్టు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. తాను మేయర్ కావడంతో కొందరు కార్పొరేటర్ల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుందన్నారు. ‘‘అధికార పార్టీ కాంగ్రెస్​లో ఉంటేనే అభివృద్ధి జరుగుతది. అధికారులు కూడా సహకరిస్తరు. లేకపోతే డెవలప్​మెంట్ కష్టమవుతది. పది రోజులుగా పార్టీ మార్పుపై చాలా మందితో చర్చించాను. ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను’’అని చెప్పారు. విజయలక్ష్మితో పాటు కొంత మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్​లోచేరుతున్నట్టు తెలుస్తున్నది.

కాంగ్రెస్​లో చేరనున్నఇంద్రకరణ్ రెడ్డి

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అర్వింద్ రెడ్డి గురువారం కేకేతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్​లో చేరికపై ఆయనతో చర్చించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి రేవంత్ సమక్షంలోనే ఇంద్రకరణ్ రెడ్డి, అర్వింద్ రెడ్డి శనివారం కాంగ్రెస్​లో చేరనున్నారు. వీరిద్దరు కూడా పార్టీ మారుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నది. 1999 నుంచి 2009 దాకా ఐకే రెడ్డి కాంగ్రెస్​లో పని చేశారు. ఆ తర్వాత పార్టీ మారారు. బీఎస్పీ నుంచి 2014 ఎన్నికల్లో నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచి..

టీఆర్ఎస్​లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ టికెట్‌‌‌‌‌‌‌‌పై గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక గడ్డం అర్వింద్ తెలంగాణ రాకముందు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నుంచి రెండుసార్లు మంచిర్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. 2018 ఎన్నికలకు ముందు టికెట్ రాలేదని మళ్లీ కాంగ్రెస్ నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఆయన ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.