మేయర్ పీఠంపై పార్టీల కన్ను..కొత్తగూడెం కార్పొరేషన్‌ లో ఎన్నికల వేడి

మేయర్ పీఠంపై పార్టీల కన్ను..కొత్తగూడెం కార్పొరేషన్‌ లో ఎన్నికల వేడి
  • పొత్తుల సస్పెన్స్.. పోటాపోటీగా ప్రధాన పార్టీల వ్యూహాలు 
  • రిజర్వేషన్ల కోసం ఆశావహుల ఎదురుచూపులు..

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవి ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాఫిక్​గా మారింది. అన్ని పార్టీల కన్ను మేయర్​ పీఠంపైనే ఉంది. ఈ తొలి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, స్థానిక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న సీపీఐ, పట్టు నిలుపుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీలు ముమ్మరంగా పావులు కదుపుతున్నాయి. కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని తీరాలని ఆయా పార్టీల అగ్రనేతలు ఇప్పటికే క్షేత్రస్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఎవరి ప్రయత్నాలు వారివి.. 

కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, పార్టీలో కోవర్టులకు తావులేదని హెచ్చరిస్తూ ఎన్నికల బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఇప్పటికే డివిజన్ల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రచారాన్ని వేగవంతం చేశారు. మరోవైపు, కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కార్పొరేషన్‌పై ఎర్రజెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా గత మున్సిపాలిటీ ఫలితాలను పునరావృతం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

ఆసక్తికరంగా పొత్తుల అంశం 

ఈ ఎన్నికల్లో పొత్తుల అంశం అత్యంత ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేసినప్పటికీ, ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగాయి. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే మేయర్ పదవి తమకే కేటాయించాలని సీపీఐ డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రాకపోతే, ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే దిశగా కూడా సీపీఐ నేతలు సంకేతాలిస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో జరిగే సీపీఐ వందేండ్ల పండగ తర్వాత ఎన్నికల ప్రచారం ఉధృతం చేయాలని నేతలు, కార్యకర్తలకు కూనంనేని సూచించారు.

అప్పుడే ఆశావహుల లాబీయింగ్..

ఎన్నికల నగారా మోగకముందే ఆశావహులు తమ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టారు. కొత్తగూడెం మేయర్ పదవితో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొత్తగూడెం మేయర్ జనరల్ లేదా బీసీకి, ఇల్లెందు బీసీకి, అశ్వారావుపేట ఎస్టీకి కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. రిజర్వేషన్లు ఖరారైతే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కార్పొరేటర్లు, కౌన్సిలర్ల అభ్యర్థులు భారీ ఎత్తున సిద్ధమవుతున్నారు.