
హైదరాబాద్, వెలుగు: కొత్త మెట్రో ప్రాజెక్టులను మెరుగైన ఆలోచనలతో, ఐఐటీల సహాయంతో అభివృద్ధి చేస్తామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత మెట్రోను లేటెస్ట్ టెక్నాలజీతో, ప్రపంచంలోని టాప్ సిటీలతో పోటీ పడేలా నిర్మించామని వెల్లడించారు. ఎనర్జీ సేవ్ చేస్తూ, ఈకో-ఫ్రెండ్లీగా అభివృద్ధి చేయడం వల్ల 350కి పైగా నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయని తెలిపారు. మొదట మెట్రో వద్దన్నోళ్లు ఇప్పుడు దాని కోసం డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు, ప్రొఫెసర్లు నిర్వహించిన సస్టైనబుల్ అండ్ గ్రీన్ సిటీస్ మీటింగ్ కు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
సిటీలు సస్టైనబుల్‌గా డెవలప్ అవ్వాలంటే, గవర్నమెంట్, ఇండస్ట్రీలు, రీసెర్చ్ సెంటర్లు కలిసి పని చేయాలని చెప్పారు. ఐఐటీలు తమ నాలెడ్జిని పంచుకోవాలని కోరారు. సిటీలపై ప్రెషర్ పెరుగుతోందని, ఈకో-ఫ్రెండ్లీగా సిటీలు నిర్మించడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వేస్ట్ మేనేజ్‌మెంట్, వాటర్ సేవింగ్ వంటివి ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి వర్చువల్ గా మాట్లాడారు. ప్రొఫెసర్ అశ్విన్ మహాలింగం, ప్రొఫెసర్ మనూ సంతానం, ప్రొఫెసర్ గీతాకృష్ణన్, ఐఐటీ మద్రాస్ నుంచి ఉత్తీర్ణులై ఉన్నత స్థానాల్లో ఉన్న ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.