V6 News

సింగరేణిలో పరికరాల కొరత.. పాత మెషీన్లు రిపేర్ చేసి వాడుతున్నారు

సింగరేణిలో పరికరాల కొరత.. పాత మెషీన్లు రిపేర్ చేసి వాడుతున్నారు
  • సరిపడా అందుబాటులో లేని డ్రిల్​ రాడ్లు, బిట్లు, పైకప్పు సపోర్టులు
  • రక్షణ పరికరాలు లేక కార్మికుల ఇబ్బందులు

కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి కంపెనీలో పరికరాల కొరత కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. కీలకమైన యంత్రాలు, పనిముట్లు అందుబాటులో లేకపోవడం వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. నాసిరకం పరికరాలు అందించడం వల్ల యంత్రాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. 

గనుల్లో పని చేసే కోల్‌ కట్టర్లు, సపోర్ట్‌ మెన్‌లు, లైన్‌మెన్‌లు, టింబర్‌మెన్‌లకు అవసరమైన డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్లు, పైకప్పు సపోర్టులు, ఇతర విడిభాగాలు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో పాత వాటినే మరమ్మతులు చేసి వినియోగించాల్సి వస్తోందని కార్మికులు పేర్కొంటున్నారు. కొద్ది నెలలుగా కార్మిక సంఘాలు పరికరాల కొనుగోలుపై డిమాండ్ చేస్తున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు.

డ్రిల్ రాడ్లు, బిట్ల కొరత..

భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అవసరమైన డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్ల కొరత తీవ్రంగా ఉంది. బొగ్గు పొరల్లో రంధ్రాలు వేయడానికి వీటిని వినియోగిస్తారు. ప్రస్తుతం అరిగిపోయిన డ్రిల్ రాడ్లకు మరో భాగాన్ని జతచేసి ఉపయోగిస్తున్నారు. ఒక డ్రిల్ యంత్రంతో సగటున 50 రంధ్రాలు వేయగలిగే పరిస్థితి ఉండగా, పాత రాడ్లు, బిట్లతో పని చేయడం వల్ల కార్మికులపై పనిభారం పెరుగుతోంది. భూగర్భ గనుల్లో పైకప్పు కూలిపోకుండా రక్షణగా ఉపయోగించే కర్ర దిమ్మలు, ఇనుప ప్రాప్స్ కూడా తగినంతగా అందుబాటులో లేవు. సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఉన్నవాటితోనే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

స్పేర్​ పార్ట్స్​ లేక ఆగిన యంత్రాలు..

బొగ్గు ఉత్పత్తి ప్రధానంగా యంత్రాలపై ఆధారపడుతున్నప్పటికీ వాటికి అవసరమైన విడిభాగాలు అందుబాటులో లేకపోవడంతో యంత్రాలు తరచూ నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఉపయోగించే డంపర్లకు అవసరమైన టైర్లు, ఇతర భాగాలు లేకపోవడంతో అవి వర్క్​షాపులకే పరిమితమవుతున్నాయి. రోజుకు కనీసం 15 నుంచి 20 ట్రిప్పులు చేసే డంపర్లు రోజుల తరబడి నిలిచిపోవడం ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది.

పరికరాల సప్లైలో సింగరేణి నిర్లక్ష్యం

బొగ్గు ఉత్పత్తి కోసం కార్మికులపై ఒత్తిడి తీసుకువస్తున్న యాజమాన్యం వారికి అవసరమైన రక్షణ పనిముట్లను సకాలంలో అందించడం లేదు. కమీషన్ల కోసం క్వాలిటీ లేని పరికరాలు ఇవ్వడంతో కొద్ది రోజులకే అవి పాడవుతున్నాయి. యాజమాన్యం అధిక ఉత్పత్తికే ప్రాధాన్యమిస్తూ కార్మికుల రక్షణను విస్మరిస్తుంది. డ్రిల్​రాడ్లు, డ్రిల్​ బిట్లు అరిగిపోయినప్పటికీ వాటితోనే పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో కార్మికులపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.

- ఎస్​.వెంకటస్వామి, సీఐటీయూ నేత–