5.5 కోట్లు పెట్టి కట్టిన్రు.. మెయింటెనెన్స్ మరిచిండ్రు..

5.5 కోట్లు పెట్టి కట్టిన్రు.. మెయింటెనెన్స్ మరిచిండ్రు..

మెదక్‌ స్టేడియంలో ఇంటర్‌నేషనల్‌ స్టాండర్డ్స్‌తో అథ్లెటిక్స్ ట్రాక్‌ నిర్మాణం
ఫండ్స్‌ రాక పూర్తికాని పనులు
ట్రాక్‌ చుట్టూ పెరుగుతున్న గడ్డి

మెదక్‌ జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) ఆధ్వర్యంలో రూ.5.5 కోట్లతో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్‌ నిర్మించారు. ఇంటర్‌నేషనల్‌ స్టాండర్డ్స్ తో నిర్మించిన ఈ ట్రాక్‌కు సరైన మెయింటెనెన్స్‌ లేక చుట్టూ గడ్డి మొలుస్తోంది. ఇది పెరిగి పెద్దదైతే ట్రాక్‌ దెబ్బతినే అవకాశం ఉంది. దాంతో ప్లేయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెదక్/మెదక్ టౌన్, వెలుగు: జిల్లా కేంద్రమైన మెదక్‌లోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ స్టేడియంలో స్పోర్స్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) 2000 సంవత్సరం చివరలో అథ్లెటిక్స్ అకాడమి ఏర్పాటు చేసింది. స్టేట్ లెవల్‌ పోటీల్లో సెలక్ట్ అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన అథ్లెట్లకు ఈ అకాడమీలో ప్రవేశం కల్పించేవారు. ఈ అకాడమీ నుంచి ఎందరో స్టేట్, నేషనల్ లెవల్‌ టోర్నీలలో మంచి ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. అయితే పెద్ద స్టేడియం ఉన్నప్పటికీ అథ్లెట్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు ట్రాక్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చొరవ తీసుకున్నారు. అథ్లెట్ల ట్రైనింగ్, డిస్ట్రిక్ట్, స్టేట్ లెవల్ అథ్లెటిక్స్ పోటీల నిర్వహణ కోసం ఇందిరాగాంధీ స్పోర్ట్స్ స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్ సాంక్షన్ చేయించారు. కేంద్ర ప్రభుత్వం ‘ఖేలో ఇండియా’ కింద ట్రాక్‌ నిర్మాణానికి రూ.5.5 కోట్లు మంజూరు చేసింది. 2018లో జూలైలో ట్రాక్‌ పనులు ప్రారంభించారు. 400 మీటర్లపొడవు, 8 లైన్లతో సింథటిక్ ట్రాక్ను ఇంటర్‌‌నేషనల్‌ స్టాండర్డ్స్‌తో నిర్మించారు.

అదనపు పనులు అలాగే..
ట్రాక్‌ నిర్మాణంతోపాటు దాని పక్కనే లాంగ్‌జంప్‌ పోటీల కోసం ఓ ట్రాక్, అథ్లెటిక్స్ ట్రాక్ చుట్టూ ఫెన్సింగ్, ట్రాక్‌ మధ్యలో ఫుట్‌బాల్‌ కోర్టు నిర్మించాలని తర్వాత నిర్ణయించారు. వీటి కోసం రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుందని ఎస్టిమేషన్‌ వేశారు. అయితే ఈ నిధులు మంజూరు కాక పనులు పెండింగ్‌లో పడ్డాయి. పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లు కేంద్రానికి ప్రపోజల్స్‌ పంపినా ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ తీసుకోకపోవడంతో ఇంతవరకు సాంక్షన్ కాలేదు.

వర్షాలకు గడ్డి మొలుస్తోంది
రూ.5.5 కోట్లు వెచ్చించి సింథటిక్ ట్రాక్ నిర్మించినా.. ఏడు నెలలుగా అది వృథాగా ఉంది. వినియోగంలో లేకపోవడం, మెయింటెనెన్స్‌ లేకపోవడంతో ట్రాక్ మధ్యలో, బయటి వైపు లాంగ్‌జంప్ కోసం నిర్మించిన ట్రాక్‌ చుట్టూ గడ్డి మొలిచింది. వర్షాలకు పెరిగి ఇది ట్రాక్‌ మీదకు వస్తోంది. దీంతో కోట్లు వెచ్చించి నిర్మించిన ట్రాక్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికైనా లీడర్లు స్పందించి ఫండ్స్‌ సాంక్షన్‌ చేయించాలని ప్లేయర్లు కోరుతున్నారు.

ఫండ్స్ కోసం లెటర్ రాసినం
రూ.2 కోట్ల నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి లెటర్‌ రాసినం. ట్రాక్‌ నిర్మాణం మొత్తం పూర్తయింది. నిధులు రాగానే మిగతా పనులు పూర్తి చేస్తం. – ప్రసాద్, అథ్లెటిక్స్ అకాడమి ఇన్‌చార్జి

For More News..

నిజామాబాద్ బాలుడి హత్య కేసులో నిందితుడు నాగరాజే

బంగారం కంటే ప్లాటినమే అగ్గువ.. ఆసక్తి చూపుతున్న యువత

రూపాయికి జోష్.. 20 నెలల్లో ఎన్నడూ లేనంత పైకి