మెదక్ బంద్​ ప్రశాంతం

మెదక్ బంద్​ ప్రశాంతం
  •      పరిస్థితి పర్యవేక్షించిన మల్టీ జోన్​ ఐజీ రంగనాథ్​
  •     మూడు కేసులు నమోదు
  •     తొమ్మిది మంది అరెస్ట్​

మెదక్, వెలుగు: మెదక్ బంద్​ ప్రశాంతంగా జరిగింది. శనివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ, బీజేవైఎం ఆదివారం మెదక్ బంద్​కు పిలుపునిచ్చాయి. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ ​బంక్​లు, హోటళ్లు, దుకాణాలు స్వచ్చందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు నడిచాయి. బస్టాండ్​లు, చౌరస్తాల వద్ద పోలీ సులు​ పికెట్​ఏర్పాటు చేయడంతో పాటు, పట్టణంలో పెట్రోలింగ్​ నిర్వహించారు. మల్టీజోన్​ఐజీ రంగనాథ్​ మెదక్ వచ్చి, ఎస్పీ బాలస్వామితో కలిసి పరిస్థితి సమీక్షించారు.  

45 మందిని గుర్తించాం : మల్టీ జోన్​ఐజీ 

శనివారం జరిగిన గొడవలు, దాడులకు, హాస్పిటల్స్ ధ్వంసానికి కారణమైన ఇరువర్గాలకు చెందిన 45 మందిని  గుర్తించామని మల్టీజోన్​ఐజీ రంగనాథ్​ తెలిపారు. మెదక్ టౌన్​ పోలీస్​ స్టేషన్​లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసి ఓ వర్గానికి చెందిన తొమ్మిది మందిని అరెస్ట్​ చేశామని చెప్పారు. మరో వర్గానికి చెందిన వారిని సైతం అరెస్ట్​ చేస్తామన్నారు.

స్పెషల్​ టీమ్​ లు ఏర్పాటు చేసి, ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, దాడులు జరిగిన హాస్పిటల్స్, హోటల్స్​ వద్ద ఉన్న సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించి బాధ్యులందరినీ ఐడెంటిఫై చేసి కేసులు నమోదు చేస్తామన్నారు.  ప్రత్యక్షంగా దాడులు చేసిన వారు మాత్రమే కాకుండా ఐపీసీ సెక్షన్ 34 ,149 ప్రకారం గొడవ జరిగిన చోట గుంపులో ఉన్నవారు కూడా బాధ్యులవుతారన్నారు. సోషల్ మీడియాలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టొద్దని, ప్రజలు అనవసరమైన వదంతులు నమ్మొద్దని సూచించారు. 

శనివారం ఘటనలో పోలీసులు సరైన విధంగా స్పందించలేదని తేలితే వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు పీస్​కమిటీ మీటింగ్​ కూడా ఏర్పాటు చేసి మాట్లాడారు.  ఎస్పీ బాలస్వామి, ఏఎస్పీ మహేందర్, డీఎస్పీ రాజేశ్, మున్సిపల్​ చైర్మన్​ చంద్రపాల్, మాజీ చైర్మన్​ బట్టి జగపతి, కౌన్సిలర్​ లక్ష్మీనారాయణ గౌడ్, బీజేపీ జిల్లా లీడర్లు నందారెడ్డి, గడ్డం కాశీనాథ్, మైనార్టీ లీడర్లు ఖాజా మొయినొద్దీన్, జావేద్​మౌలానా, భారత్​ఆరీఫ్, హఫీజ్, అంజద్, అఫ్జల్, అహ్మద్​ బేగ్, షాహెద్ ​అలీ పాల్గొన్నారు. ​